Kavitha allegations On Harish Rao: కేసీఆర్‌పై కుట్ర చేస్తోంది హరీష్ రావు, సంతోష్ రావే - కవిత సంచలన ఆరోపణలు
BRS Kavitha: కేసీఆర్ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కోవడానికి ఇద్దరు ముగ్గురు కారణం అని కవిత ఆరోపించారు. వారిలో హరీష్ రావు కీలకమన్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్‌లో సంచలనం రేపుతున్నాయి.

Kavitha accused conspiring against KCR: భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ పై కొంత మంది కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై ఆరోపణలు రావడానికి ఇద్దరు, ముగ్గురు నేతలే కీలకమన్నారు. వారిలో హరీష్ రావు ముఖ్యవ్యక్తి అని ఆరోపించారు. సంతోష్ రావు కూడా ఉన్నారన్నారు. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ కవిత కంటతడి పెట్టారు. ముగ్గురి వల్ల తన తండ్రిపై మరకలు పడుతున్నాయన్నారు. మా నాన్న పరువు పోతే నాకు బాధ ఉండదా అని ఆవేదన వ్యక్తంమ చేశారు.
కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సభ్యులతో సమావశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మా నాన్నకు తిండి డబ్బు యావ లేదన్నారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. కడుపు మండిపోతోందన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ ఉన్నారని.. వారికి కావాల్సింది డబ్బు అని.. వారి వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం అక్రమాల్లో హరీష్ రావు పాత్ర ఉందనే.. కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా ఆయనను తప్పించాలని కవిత గుర్తు చేశారు. దమ్ముంటే హరీష్ రావు, సంతోష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
హరీష్ రావు, సంతోష్ రావు వ్యక్తిగత స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టే అంత పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత..పోతే ఎంత అని ప్రశ్నించారు. కాళేశ్వరం అక్రమాల విషయంలో అధికారుల పాత్ర ఉందని.. వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారని అన్నారు. ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా..తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.తనపై సొంతపార్టీలో కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీడియా చిట్ చాట్‌లో తన లేఖను బయటపెట్టడంపై మాట్లాడారు. కేసీఆర్ చుట్టూ పార్టీలో దెయ్యాలు ఉన్నాయన్నారు. తన లేఖను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోమంటే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో నేరుగా ఎవరిపైనా కవిత పేర్లు పెట్టి ఆరోపణలు చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు.
హరీష్ రావు, సంతోష్ రావుతో కవితతో పార్టీ పరమైన విబేధాలు ఉన్నట్లు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. కానీ హఠాత్తుగా వారిద్దరిని కవిత టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీలో ఆయనే పోరాడారు. న్యాయపరమైన పోరాటం కూడా చేస్తున్నారు. వరుసగా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు. అయితే అసలు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణం అని చెబుతూండటంతో.. బీఆర్ఎస్ పార్టీలోనూ సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.





















