Telangana TDP : తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ వైదొలిగిందా ? - నిజమేంటో చెప్పిన కాసాని జ్ఞానేశ్వర్ !
తెలంగాణ టీడీపీ ఎన్నికల నుంచి వైదొలగలేదని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Telangana TDP : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిదని సోషల్ మీడియాలో ఒక్క సారిగా ప్రచారం ప్రారంభమయింది. మంగళవారం ఉదయం నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం చేస్తున్నారని ఆయన అంటున్నారు.
కావాలనే టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారన్న కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాడనికి టీ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. 75 మంది అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమయిందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటంతో అభ్యర్థులను ప్రకటించడానికి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయ్యారు. అప్పుడు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలతో... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏమిటో స్పష్టత లేదు. కానీ.. జనసేనకు పన్నెండు సీట్లు కేటాయిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో లిస్ట్ వెలుగులోకి వచ్చింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఉంటాయని ఇప్పటి వరకూ ప్రచారం
కానీ బీజేపీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత జనసేనతో పొత్తులపై మాట్లాడటం లేదు. జనసేనతో పొత్తులపై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. నారా లోకేష్ అమిత్ షాను కలిసినప్పుడు .. కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో టీడీపీతో కూడా చర్చలు జరిగాయని అనుకున్నారు. అయితే చంద్రబాబు విడుదల ఆలస్యమవుతూండటం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉండటంతో పాటు.. హైకోర్టులో బెయిల్ విషయంలో కూడా తేలడం లేదు. వాయిదాలు పడుతూ వస్తోంది. అదే సమయంలో ములాఖత్ లను రాజమండ్రి జైలు అధికారులు తగ్గించారు.
చంద్రబాబును కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న కాసాని
చంద్రబాబును కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని.. టీ టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. ఈ లోపే కొంత మంది టీడీపీ ... తెలంగాణ ఎన్నికల నుంచి వైదొలిగిందని ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నేతలు ప్రచారాలు కూడా చేసుకుంటున్నరు. టీ టీడీపీ నేతలు మాత్రం పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత ఏ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.