Minister Gangula Kamalakar : చంద్రబాబు, పవన్ , షర్మిల అంతా బీజేపీ బాణాలే, సమైక్య రాష్ట్రమే వీరి ఎజెండా- మంత్రి గంగుల
Minister Gangula Kamalakar : చంద్రబాబు, పవన్, షర్మిల, కేఏ పాల్ అందరూ బీజేపీ వదిలిన బాణాలే అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. డిఫరెంట్ వేషాల్లో వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలన్నారు.
![Minister Gangula Kamalakar : చంద్రబాబు, పవన్ , షర్మిల అంతా బీజేపీ బాణాలే, సమైక్య రాష్ట్రమే వీరి ఎజెండా- మంత్రి గంగుల Karimnagara MInister Gangula Kamalakar criticizes Chandrababu Pawan Sharmila enters Telangana politics DNN Minister Gangula Kamalakar : చంద్రబాబు, పవన్ , షర్మిల అంతా బీజేపీ బాణాలే, సమైక్య రాష్ట్రమే వీరి ఎజెండా- మంత్రి గంగుల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/5479c0f9c213597d2e6377b9a7b6827b1671701206011235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Gangula Kamalakar : తెలంగాణ కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మంత్రి గంగుల చెప్పారు. ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏళ్ల గడువుందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ బిడ్డ షర్మిల వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందన్నారు. పవన్ కల్యాణ్, కేఏ పాల్ కూడా వచ్చారన్నారు. వీరంతా తెలంగాణ సంపదపై కన్నేశారని ఆరోపించారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటర్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబు పాత బిడ్డల్లారా రండి అంటున్నారని మండిపడ్డారు. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అన్నారు. మళ్లీ 1956 నవంబర్ 1 గుర్తుకు తెస్తున్నారన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అని మంత్రి గంగుల ఆరోపించారు.
రాష్ట్ర సంపద కన్నేసి
"మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదు. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబు. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు. వీరందరి వెనక బీజేపీ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నారు. మన రాష్ట్ర సంపదపై కన్నేసి వస్తున్నారు. హైదరాబాద్ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగమే ఇదంతా. తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. తిరుగుబాటు మొదలు పెట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది. మన బొగ్గు, మన కరెంట్ ఎత్తుకుపోతారు. వాళ్లను పారద్రోలే దాకా వెంబడించాలి. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరరు. షర్మిల బీజేపీ దూత, వాళ్ల బాణం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా బీజేపీ బాణాలే." - మంత్రి గంగుల కమలాకర్
ఏపీలో అద్భుత మెజార్టీ
నిన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు ఏడు మండలాల గురించి, సీలేరు గురించి ఎందుకు మాట్లాడలేదని మంత్రి గంగుల ప్రశ్నించారు. 3.6 లక్షల జీఎస్టీ చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. ఇంత సంపద ఉంది కాబట్టే మన మీద మళ్లీ కన్నేసారన్నారు. బీఆర్ఎస్ తో దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ పార్టీనే కదా కర్ణాటకకు, తమిళనాడుకు చంద్రబాబు ఎందుకు పోవడం లేదని మంత్రి నిలదీశారు. మనం ఏనాడు ఏపీ సంపద దోచుకోవాలనుకోలేదన్నారు. అందుకే ఏపీలో పక్కా పోటీ చేస్తామన్నారు. వాళ్లు గతంలో తెలంగాణను దోచుకున్నవాళ్లు, దోచుకోవాలనుకుంటున్న వాళ్లు కాబట్టే వ్యతిరేకిస్తున్నామన్నారు. తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు వాళ్లను నమ్మరన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు కూడా వీళ్లను నమ్మరన్నారు. మద్రాసు నుంచి తన్ని తరిమేస్తే సంపద ఎక్కువగా ఉన్న తెలంగాణను ఏపీలో ఆనాడు కలిపారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ వేర్వేరు వేషాల్లో గద్దల్లా తెలంగాణ సంపదను దోచుకునేందుకు వస్తున్నారన్నారు. కేసీఆర్ సత్ఫాలన చూసి దేశమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. దేశంలోని నలు మూలల నుంచి మాకు వందల ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ కు అద్భుత మెజార్టీ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ నెంబర్ 1 అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)