TTD Temple in Karimnagar: కరీంనగర్‌లో టీటీడీ ఆలయం, పదెకరాల్లో 20 కోట్లతో - నెలాఖరులో శంకుస్థాపన
కరీంనగర్‌లో కొలువుదీరనున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడుఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేసిన టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిఈనెల 31న ఉదయం 7గంటల 26 నిమిషాలకు టీటీడీ ఆలయ భూమి పూజ
కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో కరీంనగర్ వాసులకు ఆ వెంకటేశ్వరుని దర్శన కల సాకారం అవుతుంది. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మే 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని అన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుండి కరీంనగర్ ప్రజలతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. త్వరలోనే వినోద్ రావు, బాస్కర్ రావులతో కలిసి తిరుమలకు వెల్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామని అన్నారు. అత్యంత త్వరలోనే శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశిస్సులు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.