Minister Gangula: ఆ ప్రచారంలో వాస్తవం లేదు- దుబాయ్ నుంచి రావడానికి కారణం చెప్పిన మంత్రి గంగుల
Minister Gangula: బీజేపీ నాయకులు తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అలా కామెంట్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
![Minister Gangula: ఆ ప్రచారంలో వాస్తవం లేదు- దుబాయ్ నుంచి రావడానికి కారణం చెప్పిన మంత్రి గంగుల TS Politics Gangula Kamalakar Fires on BJP Leaders For Accusations on Him Minister Gangula: ఆ ప్రచారంలో వాస్తవం లేదు- దుబాయ్ నుంచి రావడానికి కారణం చెప్పిన మంత్రి గంగుల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/b72197db58d49caae81226c078032d051668074544143519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Gangula: తమపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనని విచారణ కోసం హైదరాబాద్ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్లు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి... వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న తాను తిరిగి వచ్చానని తెలిపారు.
✍️ మాపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు
— Gangula Kamalakar (@GKamalakarTRS) November 10, 2022
✍️ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజ నిజాలు తేల్చాలి
✍️ నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
✍️ నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. pic.twitter.com/ZNvAWZSjwr
నిన్నటికి నిన్న మంత్రి గంగుల కమలాకర్ సంస్థలో సోదాలు..
కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్వేతా గ్రానైట్స్ కార్యాలయం, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ శ్వేతా గ్రానైట్ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందినది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చినందున వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయడంపై ఈడీ ఆరా తీస్తోంది.
తనిఖీల్లో పాల్గొన్న 30 టీమ్ లు
బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 30 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్‌వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బలగాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కాగా, కొద్దిరోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులతోపాటు ఐటీ అధికారులు కూడా సోదాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ ఈడీ అధికారుల్లో కొంత మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
ఏకంగా మంత్రి ఇంటిలోనే వివరాల సేకరణ!
దాదాపుగా దశాబ్ద కాలం కిందట కరీంనగర్ కు చెందిన గ్రానైట్ కంపెనీలు అక్రమంగా విదేశాలకు పెద్ద ఎత్తున బ్లాక్ లను తరలించి పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని అటు సీబీఐ, ఇటు ఈడీ, ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు జరపడం పెను సంచలనానికి కారణమైంది. జిల్లాకి చెందిన కీలక నేత మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలో సోదాలతోపాటు... ఏకంగా ఆయన ఇంటి తాళం పగల కొట్టి మరీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు హుటాహుటిన దుబాయ్ పర్యటనను విరమించుకొని వచ్చిన గంగుల కమలాకర్ దర్యాప్తుకు సహకరిస్తారని పేర్కొన్నారు. అయితే కమలాకర్ తో పాటు దాడులకు గురైన కంపెనీలన్నీ కరీంనగర్ కి చెందినవే కావడం గమనార్హం.
దీంతో దేశ వ్యాప్తంగా వివిధ కేసుల్లో కేంద్ర ఏజెన్సీల విచారణకు కరీంనగర్ సెంటర్ గా మారుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల కేంద్ర ఏజెన్సీలు కరీంనగర్ ని వరుస పెట్టి టార్గెట్ చేస్తున్నాయని రానున్న రోజుల్లో ఇది ఎటువైపు దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)