Karimnagarలో టీటీడీ ఆలయ నిర్మాణ భూమి పూజకు TTD ఛైర్మన్, జేఈఓలకు మంత్రి గంగుల ఆహ్వానం
కరీంనగర్ లో త్వరలో నిర్మించనున్న టీటీడీ ఆలయం భూమి పూజకు రావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈఓ ధర్మారావులను మంత్రి గంగుల, వినోద్ కుమార్ ఆహ్వానించారు.
TTD temple in Karimnagar: తిరుమల శ్రీవారిని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, భాస్కర్ రావులతో కలిసి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కరీంనగర్ లో త్వరలో నిర్మించనున్న టీటీడీ ఆలయం భూమి పూజకు రావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈఓ ధర్మారావులను మంత్రి గంగుల, వినోద్ కుమార్ ఆహ్వానించారు. కరీంనగర్ పద్మనగర్ లో 10 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయ భూమి పూజకు రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో నిర్మించే అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాధ వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలించారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ తెలంగాణ టీటీడీ బోర్డు అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, దొంత రమేష్ తదితరులు ఉన్నారు
పదెకరాల్లో 20 కోట్లతో కరీంనగర్‌లో టీటీడీ ఆలయం
కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో కరీంనగర్ వాసులకు ఆ వెంకటేశ్వరుని దర్శన కల సాకారం అవుతుంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావుకు అందజేశారు.
Also Read: TTD News: తిరుమల బూందీ పోటులో లడ్డూ ట్రేలు మాయం - ఐదుగురు నిందితులను పట్టుకున్న అధికారులు
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మే 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని అన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుండి కరీంనగర్ ప్రజలతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల అన్నారు. అత్యంత త్వరలోనే శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశిస్సులు అందిస్తామని అన్నారు. ఆలయ నిర్మాణ భూమి పూజకు టీటీడీ ఛైర్మన్, జేఈఓలను ఆహ్వానించారు.
Also Read: Padmavathi Ammavari Teppotsavam: ఐదురోజుల పాటు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు