Tula Uma News: వేములవాడలో బీజేపీకి భారీ కుదుపు, బీఆర్ఎస్‌లోకి తుల ఉమ - లైన్‌లోకి కేటీఆర్!
Vemulawada News: తుల ఉమ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. నిరాకరించి ఆఖరి నిమిషంలో చెన్నమనేని వికాస్ రావుకు బీఫాం దక్కడంతో తుల ఉమ కన్నీరుమున్నీరు అయిన సంగతి తెలిసిందే.
Tula Uma News: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్ అయిన తుల ఉమ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. నిరాకరించి ఆఖరి నిమిషంలో చెన్నమనేని వికాస్ రావుకు బీఫాం దక్కడంతో తుల ఉమ కన్నీరుమున్నీరు అయిన సంగతి తెలిసిందే. దీంతో బాగా భంగపడ్డ ఆమె కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు తుల ఉమతో రెండు గంటలుగా చర్చలు కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా వినోద్ కుమార్ ఆమెతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో లైన్ లోకి వచ్చి ఉమతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. ఆదివారం (నవంబరు 12) మధ్యాహ్నం ఉమ ఇంటికి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తుల ఉమ బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రేపు కేటీఆర్ సమక్షంలో చేరిక ఉంటుందని తెలుస్తోంది.
బీజేపీ తీరుతో తుల ఉమ కంటతడి
ఆఖరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను కూడా బీజేపీ మార్చేసింది. తొలుత వేములవాడ బీజేపీ అభ్యర్థి పేరు తుల ఉమ ఉండగా చివరి నిమిషంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ రావును బీజేపీ ప్రకటించింది. దీంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ బరిలో తాను కచ్చితంగా ఉంటానని.. బీజేపీ బీసీ, మహిళా నినాదం అంతా బోగస్ అని పార్టీని విమర్శించారు. అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం కూడా తనకు ఇవ్వలేదని వాపోయారు.
ప్రజలతో సన్నిహిత సంబంధాలు
కరీంనగర్ రాజకీయాల్లో తుల ఉమది ప్రత్యేక ప్రస్థానం. వామపక్ష భావజాలంతో చిన్నవయసులోనే నక్సలైట్‌గా మారి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వేములవాడ అంతటా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న తుల ఉమ కొద్ది నెలల క్రితం తన మనసులో మాట బయటపెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామాతో అప్పట్లో ఆయన వెంట నడిచారు తుల ఉమ. బీజేపీలో జాయిన్ అవుతూనే తనకున్న రాజకీయ భవిష్యత్తుని కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఓ సమావేశంలో బహిరంగంగానే తాను రానున్న ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించుకున్నారు. కానీ, బీజేపీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి బీ ఫాం ఇవ్వకుండా చేయడం తుల ఉమను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.
అదే సమయంలో వికాస్ పేరు కూడా
తుల ఉమ పేరుతో పాటు, అప్పట్లో మరో యువ నాయకుడు పేరు కూడా బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ పేరు వినపడింది. కానీ ఎందుకో మళ్ళీ కొద్ది రోజులు ఆ విషయంపై ఎవరూ నోరు మెదపలేదు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలు వేములవాడ బీజేపీ టికెట్ తుల ఉమకే అనుకున్నారు. ఆఖరికి ఆమెకు వచ్చినట్లే వచ్చి చేజారి వికాస్ ను వరించింది.