Siricilla BJP : కేటీఆర్ ఇలాఖాలో బీజేపీకి తప్పని తిప్పలు - కీలక నేత పార్టీకి దూరం !
బీజేపీకి రాజీనామా చేశారు సిరిసిల్ల బీజేపీ కీలక నేత కటకం శ్రీధర్. అయితే తామే బహిష్కరించామని బీజేపీ ప్రకటించింది.
Siricilla BJP : భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముఖ్య నేతల్ని గురి పెట్టి రాజకీయం చేస్తున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఆ పార్టీకి తరచూ షాక్ ఇస్తున్నారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో కీలక నేతను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. అయితే అంతకు ముందే తాను రాజీనామా చేశానని ఆయన నేత ప్రకటించుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం బీజేపీలో కీలకంగా ఉంటున్న కటకం శ్రీధర్ పంతులుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ సమయాని తానే బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్టుగా కటకం శ్రీధర్ లేఖ విడుదల చేశారు.
అభివృద్ధి కోసం కండువా మారుస్తానన్న కటకం శ్రీధర్
కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా , జిల్లాలో ముఖ్యమైన నేతగా రాజకీయాల్లో వెలుగు వెలిగి తరువాత బీజేపీ లోకి అడుగు పెట్టిన సీనియర్ నేత కటకం మృత్యుంజయం కుమారుడే కటకం శ్రీధర్. ప్రస్తుతం గంభీరావుపేట సర్పంచ్ గానూ వ్యవహరిస్తున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న బీజేపీ పార్టీకి గంభీరావుపేట లాంటి ప్రాంతాల్లో కాస్త యాక్టివ్ గా ఉన్న నేతగా శ్రీధర్‌కి పేరుంది. అయితే ఈ మధ్య అభివృద్ధి రాజకీయాల కోసం తాను కండువా మార్చడానికి సైతం సిద్ధమేనంటూ శ్రీధర్ వ్యాఖ్యానించడం ఇక్కడ కలకలం రేగపింది.
పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం
ఇప్పటికే టిఆర్ఎస్ తరఫున యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తమ ప్రాబల్యం చూపించడానికి బీజేపీ పావులు కదుపుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు కొంత వరకూ ఆ పార్టీని స్థానిక నేతలను కార్యకర్తలను అయోమయంలో పడేసాయి. దీనిపై విచారణకు బీజేపీ నేతలు అంతర్గత ఆదేశాలు ఇచ్చారు. తప్పులు దిద్దుకునే అవకాశం వచ్చినప్పటికీ శ్రీధర్ ఎలాంటి క్షమాపణ లు గాని సరిదిద్దుకునే వ్యాఖ్యలు గాని తిరిగి చేయలేదు.దీంతో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని భావించిన పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవడానికి మొగ్గుచూపింది .
బీజేపీలోనే శ్రీధర్ తండ్రి మృత్యుంజయం
శ్రీధర్ తండ్రి కటకం మృత్యుంజయం ఇప్పటికీ బీజేపీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా తిరగడమే కాకుండా ప్రతి అంశంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పై కారాలు మిరియాలు నూరుతున్నారు. లఅయితే ఆయన కుమారుడు మాత్రం సడన్‌గా పార్టీ మారితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ స్థానిక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ తో బాటు రాష్ట్ర ప్రభుత్వం పై వివిధ అంశాల్లో వరుస ధర్నాలు ,రాస్తారోకోలు చేస్తూ కొంతవరకు యువతలో క్రేజ్ పెరుగుతున్న బిజెపికి ఇలాంటి చర్యల వల్ల గందరగోళంలో పడటం ఖాయం అని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.