Karimnagar News: స్పోర్ట్స్ అడ్డాగా రామడుగు కోట.. సినిమా తరహాలో శ్రమించి విజయం సాధించి !
తమ ఊర్లో కూడా ఆటస్థలం కరువవడంతో కొంత సొంతంగా శ్రమించి, మరికొంత ఇతరుల సహకారంతో నిరుపయోగంగా ఉన్న కోట స్థలాన్ని కలిసికట్టుగా శ్రమదానం చేసి మరీ గ్రౌండ్ గా తయారుచేసుకున్నారు.
జనాభాకి తగ్గట్టుగా పట్టణాలలొనే కాదు గ్రామాల్లో కూడా ఆటస్థలాలు కరువవుతున్నాయి. అలా తమ ఊర్లో కూడా ఆటస్థలం కరువవడంతో కొంత సొంతంగా శ్రమించి, మరికొంత ఇతరుల సహకారంతో నిరుపయోగంగా ఉన్న కోట స్థలాన్ని కలిసికట్టుగా శ్రమదానం చేసి మరీ గ్రౌండ్ గా తయారుచేసుకున్నారు ఓ గ్రామ యువత.. హీరో నితిన్ బ్లాక్ బస్టర్ "సై" సినిమాలో కాలేజీ గ్రౌండ్ ని తిరిగి ఎలా సొంతం చేసుకున్నారో చూశాం. రీల్ స్టోరీ లాంటి రియల్ స్టోరీ ఇది.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామడుగు. ఎంట్రన్స్ లోనే పురాతన కోట స్వాగతం పలుకుతుంది. నిజానికి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అనేక మంది వాలీబాల్, హ్యాండ్ బాల్, త్రో బాల్ , ఖో ఖో లాంటి ఆటల్లో జాతీయ స్థాయి క్రీడా కారులను అందించిన ఊరు రామడుగు. మరోవైపు స్పోర్ట్స్ కోటాలో సైతం అనేక మంది ఉద్యోగాలు సాధించారు. అయితే రాను రాను అప్పటివరకూ ఉపయోగిస్తున్న స్కూల్ గ్రౌండ్ ఆటగాళ్ళ సంఖ్య కు తగినట్లుగా సరిపోకపోవడంతో పరిష్కారం కోసం ఆలోచించారు.
వాట్ యాన్ ఐడియా..
అప్పుడే వారికి తట్టింది ఓ ఐడియా. దాదాపుగా ప్రొఫెషనల్ స్టేడియం సైజులో ఊర్లోనే ఉన్న విశాలమైన కోట ప్రాంగణాన్ని సొంతంగా కష్టపడి క్లీన్ చేసి ఆటలకు వాడుకోవాలని అనుకున్నారు కానీ, అక్కడే వచ్చింది అసలు సమస్య. కొన్ని దశాబ్దాల పాటు ఆ కోట ప్రాంగణం నిరుపయోగంగా ఉండడంతో పిచ్చి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, పాత కాలం నాటి బావి తో సహా ముళ్లపొదలతో కనీసం నడవడానికి కూడా ఉపయోగపడే విధంగా లేదు. మరోవైపు కోట లోపలికి వెళ్లడానికి జేసీబీ లాంటి పెద్ద వాహనాలకు స్థలం కూడా సరిపోదు. జేసీబీలకు ముందున్న బ్లేడ్ లను తొలగిస్తే గాని లోనికి వెళ్ళలేని పరిస్థితి. ఏదేమైనా సరే గ్రౌండ్ ని నీటుగా చేయాలనుకున్న యువత ఇక రంగంలోకి దిగారు.
చెమటోడ్చి మరి 5 ఎకరాల స్థలాన్ని బ్లేడ్ ట్రాక్టర్లతో నీటుగా చేసుకొని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అనేకసార్లు తమ ట్రాక్టర్లు అందులో ఉన్న బురదలో దిగబడి పోయినా... అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వారు వెనుతిరిగి చూడలేదు. తమ లక్ష్యం సాధించే వరకు కూడా కష్టపడి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ కోటను గమనిస్తే అర్థమవుతుంది వారు పడిన శ్రమ. ఇప్పుడు జరుగుతున్న లోకల్ క్రికెట్ టోర్నమెంట్ కి భారీ ఎత్తున టీంలు హాజరు కావడంతో తమ కృషి ఫలించిందని స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలిసి శ్రమిస్తే కలదు విజయం తధ్యం అన్నట్టు వీరి కృషి నిజంగా స్ఫూర్తిదాయకం.
తమ భావితరాలకు ఒక ఆట స్థలాన్ని అందించాలనే లక్ష్యంతోనే తామంతా కలిసి పని చేశాం. ముఖ్యంగా క్రికెట్ లాంటి ఆటలకు విశాలమైన స్థలం అవసరం కాబట్టి తాము శ్రమదానం చేయాలని నిర్ణయించుకుని అనుకున్నది సాధించాం. మహేష్ (గ్రామ యువకుడు)
తమకు ఎదురైన సమస్య క్రీడాకారులకు, పోలీస్, ఆర్మీ .శిక్షణా అభ్యర్థులకు ఎదురు కావద్దని ఆశిస్తున్నామని నీలం చందు అనే మరో యువకుడు చెప్పాడు.
ఇక గతంలో తాము క్రీడల్లో జాతీయ స్థాయిలో ఆడటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం రిజర్వేషన్ పొందగలిగామని , ప్రభుత్వం ఇక్కడున్న ప్రత్యేకతని గమనించి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సీనియర్ స్పోర్ట్స్ పర్సన్స్ కోరుతున్నారని సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు, ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మణ్ తెలిపారు.
Also Read: New Variant: ఒమిక్రాన్ - డెల్టా రకాల లక్షణాలతో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’,ఏ దేశంలో బయటపడిందంటే...
Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి