Rains in Karimnagar: పంటలతో పాటు ఇళ్లు ఖతం.. కరీంనగర్ నగర్ వాసుల కన్నీటి వ్యథ ఇది!
Rains in Karimnagar: వారం రోజులుగా కురుస్తున్న వర్షం ఆగిపోయింది. కానీ దాని వల్ల అన్నదాతలకు కన్నీరే మిగిలింది. పేదోళ్ల పరిస్థితి కూడా అంతే. వర్షం వల్ల గూడును కోల్పోయి బిక్కుబిక్కుమంటూ రోడ్లపై పడ్డారు.
Rains in Karimnagar: గతం వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. ఎక్కడికక్కడ భారీ వరదలు పోటెత్తాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ చోట నీరే కనిపిస్తోంది. కాస్తు ముంపు ఉన్న చోట అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గురువారం రోజున జిల్లాలో సగటున 103.5 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కాస్త వరుణుడు శాంతించాడు. కానీ అన్నదాతలు, సామాన్య ప్రజలు మాత్రం ఈ వర్ష ధాటికి ఆగమైపోయారు.
నారాయణపూర్ రిజర్వాయర్ చెరువు కట్టకు గండి..
జగిత్యాల జిల్లాలోని గంగాధరలోని నారాయణపూర్ రిజర్వాయర్ కు అధికారులు గండి కొట్టారు. భారీ వర్షాలతో పెద్ద ఎత్తున నీరు రావడంతో వరద పోటు ఎక్కువ అయింది. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులే రిజర్వాయర్ కుడి వైపున గండి కొట్టి ఆ నీటిని వదిలారు .లేకుంటే పరిస్థితి భయంకరంగా మారి ఉండేదని అధికారులు వివరించారు. ఎల్లంపల్లి నుండి నేరుగా నారాయణపూర్ రిజర్వాయర్ కు పైప్ లైన్ ఉంది. దీని ద్వారా 30 గ్రామాలకు సాగునీరు అందుతోంది. చొప్పదండి నియోజకవర్గం లోని అన్ని మండలాలతో పాటు కొత్తపల్లిలో కొన్ని గ్రామాలకు మంచినీరుకి ఇదే ఆధారం.
రామడుగు బ్రిడ్జి మొత్తం నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవి శంకర్ తో పాటు కలెక్టర్ రామడుగు బ్రిడ్జి వద్ద పరిస్థితిని క్షేత్ర స్థాయిలో ఉండి సమీక్షించారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. తిమ్మాపూర్ మండలంలోని 20 కుటుంబాలను వరద కారణంగా స్థానిక పాఠశాలకు తరలించారు .అక్కడ వారికి వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మానకొండూరు మండలంలోని అనేక చెరువులు కుంటలు నిండిపోవడంతో కొత్తగా వస్తున్న అన్నారం రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. కరీంనగర్ పట్టణం లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అనేక ఇళ్లు నీటమునిగాయి. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. దీంతో అటు వర్షంతో ఇటు చలికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
రైతన్నకు ఎంత కష్టం.. ఎంత నష్టం..!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. భూమి కౌలుకు తీస్కొని ముందుస్తుగా నాట్లు వేసిన రైతులు, పంటలు వేసిన రైతులు లక్షల్లో నష్టపోయారు. తొలకరి జల్లు సంబురాలు జరుపుకోవాల్సిన వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పొలాలన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు వేల ఎకరాల్లో పంట వర్షానికి నీట మునిగింది. జగిత్యాల, సిరిసిల్లలోలో ఎక్కువ మంది రైతులు ముందుస్తుగానే పంటలు వేశారు. పెద్దపల్లి జిల్లాలోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడంతో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది. కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22, 972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా... ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.