Karimnagar: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెయ్యి రూపాయలు- దసరా రద్దీని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్- సామాన్య ప్రజల జేబుకు చిల్లు
Karimnagar News: దసరా నుంచి సొంత ఊళ్ల నుంచి తిరిగి వచ్చే వాళ్ల నుంచి ప్రైవేటు ట్రావెల్స్ భారీగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు నడుపుతున్నా రద్దీ కారణంగా అవి సరిపోవడం లేదు.
Telangana News: తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే సంబరం. ప్రతి ఏటా ఈ పండుగను బంధుమిత్రులతో జరుపుకోవాలని అనుకుంటారు. అయితే వ్యాపారం, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో ఉండేవారు చాలామంది ఉన్నారు. అయితే దసరా పండగ పురస్కరించుకొని ఇతర ప్రాంతాలలో ఉండే వారు ఇతర ప్రాంతాల నుంచి తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు కొంతమంది సొంత వాహనాలలో మరికొంతమంది ఆర్టీసీ బస్సుల్లో మరికొంతమంది ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణం చేస్తారు. ఇతర పండుగలతో పోలిస్తే దసరా పండుగకి మాత్రం అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.
దసరా పండుగ వారం రోజుల ముందు నుంచే ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఈ రద్దీని గుర్తించిన ప్రభుత్వం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తుంది. అయినప్పటికీ బస్సుల్లో మాత్రం ఫుల్లు రద్దీగా ఉంటుంది. రద్దీని తట్టుకోలేని వాళ్లంతా ప్రైవేట్ ట్రావెల్స్‌లో వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ట్రావెల్స్ నిర్వాహకులు సామాన్య ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
హైదరాబాదు తర్వాత అతిపెద్ద బస్టాండ్ అయిన కరీంనగర్ బస్టాండ్ దసరా పండుగ ముగించుకొని ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దసరా పండుగ ముగించుకొని తమ తిరుగు ప్రయాణమయ్యే వారితో నిండిపోయింది. సాధారణంగా కరీంనగర్ నుంచి హైదరాబాదుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే ఎక్స్‌ప్రెస్ బస్సులో 250 నుంచి 300 వరకు ఉంటుంది. లగ్జరీ అయితే 300 నుంచి 350 వరకు ఉంటుంది. ఇంద్ర లహరి సూపర్ లగ్జరీ వంటి బస్సుల్లో 400 నుంచి 500 వరకు టికెట్ చార్జీలు ఉంటాయి. దసరా పండుగ కారణంగా కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారితో బస్సుల్లో రద్దీగా ఉంటున్నాయి. దీంతో కొందరు ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీన్నే అవకాశంగా మలుచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఒక్కొక్కరి వద్ద నుంచి ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే రండి లేకపోతే పొండి అన్న విధంగా సమాధానం ఇస్తున్నారు ట్రావెల్స్ వారు.
కరీంనగర్ బస్టాండ్ కేంద్రంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా....
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ బస్టాండ్ ప్రధాన బస్టాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల్, మంథని, కాలేశ్వరం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, ఆసిఫాబాద్, వైపు ఏ బస్సు వెళ్లాలన్న కరీంనగర్ మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఆర్టీసీ సంస్థ ఎన్ని ప్రత్యేక బస్సులు పెట్టినప్పటికీ ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. దీంతో కరీంనగర్ బస్టాండ్ ఎదురుగానే కొంతమంది ట్రావెల్స్ వారు అడ్డగా మార్చుకొని సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు.
గతంలో ఈ ట్రావెల్స్ వారిని అరికట్టేందుకు ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి కొంతవరకు అదుపులో ఉంచారు. కానీ పండగ సీజన్లు వచ్చాయంటే చాలు ట్రావెల్స్ వారి బాదుడు మాత్రం తప్పడం లేదు. సాక్షాత్తు బస్టాండ్ కేంద్రంగా దందా చేస్తున్న ట్రావెల్స్ నిర్వాకం ఆర్టీసీ సంస్థకు చిల్లుపడేలా చేస్తుందని ప్రయాణికులు అంటున్నారు
ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ కరవు...
సామాన్యంగా ట్రావెల్స్ కారుకి టాక్సీ ప్లేట్ ఉండాలి. డ్రైవర్‌కి బ్యాడ్జ్ ఉండాలి. వాహనం నడిపే సమయంలో యూనిఫామ్ ధరించాలన్న రూల్ ఉంది. టాక్సీ ప్లేట్ వాహనలతోపాటు కొంత మంది సొంత వాహనాలు కూడా తెచ్చి ట్రావెల్స్‌లో నడుపుతున్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమైనా పట్టించుకునే వాళ్లు లేరు. ట్రావెల్స్ వాళ్లే సొంత వాహనాలు ఇలా కమర్షియల్ కోసం వాడుతున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాదు వెళ్లే ఒక్కో ప్రయాణికుల వద్ద 800 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
సామాన్య ప్రజల ఆవేదన...
కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులో సుమారు 400 రూపాయల వరకు అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రావెల్స్‌లో వెళ్లాల్సి వస్తుందని ఒక్కరి వద్ద నుండి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ట్రావెల్స్ దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు...