Minister Gangula: ముంపు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన.. నేనున్నానంటూ బాధితులకు భరోసా!
Minister Gangula: రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
Minister Gangula: రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా తడిసి ముద్ద అయింది. ఈ క్రమంలోనే కరీంనగర్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ... అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్నిరకాల ముందస్థు జాగ్రత్తలు తీసుకొని, జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉన్నామన్నారు. ముందస్తు చర్యల్లో తీసుకుంటూ... జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు, నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మానేరు ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.
వలస కార్మికుల్ని కాపాడిన అధికారులు..
ఈరోజు ఉదయం నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో వర్షంలోనే తిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని వల్లంపాడు నుండి తీగల గుట్టపల్లి వరకూ స్వయంగా కాలినడకన తిరుగుతూ ప్రజల మంచి చెడుల్ని తెలుసుకున్నారు. ఇరుకుల వాగు ఉద్ధృతి పెరుగుతుండడంతో అక్కడి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఇబ్బంది పడుతున్న తొమ్మిది మంది వలస కార్మికులను కాపాడారు. వారందరినీ స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారు. అంటు వ్యాదులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముసురుకుతోడు, వరదతో నీళ్లు నిండిన ప్రాంతాల్లో సంచార వైద్య బృందాలను తిప్పుతున్నామని ఎవరికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తక్షణమే స్పందిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
అలాంటి వాటి వద్దకు అస్సలే వెళ్లొద్దు..
నగరంతో పాటు జిల్లా మొత్తంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ఇందుకోసం యావత్ ప్రభుత్వ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. మానేరు, ఇరుకుల వాగుల పరివాహకంలో సంపూర్ణ జాగ్రత్త చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటున్నామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా విద్యుత్ స్థంబాలు, నీటి కుంటల వద్దకు అస్సలే వెల్ల్లోద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న అధికారులకు తెలపాలని వెంటనే తాము స్పందిస్తామని వివరించారు.
సమస్యొచ్చిన వెంటనే చెప్పండి.. కచ్చితంగా స్పందిస్తాం..
అలాగే వానల వల్ల పంట నష్టం జరిగిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి గంగుల తెలిపారు. అలాగే వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి కూడా సర్కారు సాయం చేస్తుందని వివరించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్థానిక అధికారులకు సమచారం ఇస్తే చాలని.. వెంటనే వారు వచ్చి సమస్య తీరుస్తారని చెప్పారు. వర్షం పడుతున్నా కూడా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని హితవు పలికారు. ప్రజల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్, కలెక్టర్ కర్ణన్, అన్ని శాఖల జిల్లా యంత్రాంగం వెంట ఉన్నారు.