BRS Chief KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్‌కు మకాం మార్చుతున్నారా ? కారణం ఏంటంటే!
Telangana Elections 2024: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. కరీంనగర్‌కు మకాం మార్చి వ్యూహాలు రచిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
Loksabha Election 2024: హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కరీంనగర్ లో మకాం వేయబోతున్నారా? ఇక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వ్యుహ రచన చేస్తారా? అంటే అవుననే పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ జిల్లా... కేసీఆర్ కు పోలిటికల్ గా అండగా నిలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ ను ఫాలో అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ కేసీఆర్ కరీంనగర్ (Karimnagar) లో బస వెనుక ఉన్న మతలబు ఏంటి?
ఉమ్మడి కరీంనగర్ నుంచే కేసీఆర్ కార్యక్రమాలు..
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా ఉంది. ఉద్యమ కాలం నుంచి, పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. అలా చేయడం వల్ల సక్సెస్ అయ్యామంటూ గులాబీ దళపతి కేసీఆర్ పలు సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫాం హౌజ్ లో కింద పడటంతో గాయపడిన కేసీఆర్.. హైదరాబాద్‌లో తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తన మకాంను కరీంనగర్ కు మారుస్తుండడంతో... ఉత్తర తెలంగాణ భవన్ గా పిలవబడే కేసీఆర్ నివాసంలో అన్ని వసతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడి నుంచే లోక్‌సభ బరిలోకి..
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్‌సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలో కరీంనగర్ నుంచే గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు రచించినప్పటికీ... కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ సాధించిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లోను టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా గెలుపోందారు. దశాబ్ధ కాలం పాటు కరీంనగర్ బీఆర్ఎస్ అడ్డాగా మారి పోవడంతో టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్‌గా మారిపోయింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత.. ఆ పార్టీ నేతలు ఓటమిపై అంతర్గత చర్చలు మొదలు పెట్టారు. ఓటమి గల కారణాలను అన్వేషిస్తునే... పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహలపై చర్చ మొదలు పెట్టారు. కరీంనగర్ తో పాటుగా పెద్దపల్లి, ఆధిలాబాద్, నిజమాబాద్,వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లన్ని కరీంనగర్ సరౌండింగ్ లో ఉండడంతో... ఇక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసెందుకు వీలుగా ఉంటుందని భావించిన కేసీఆర్ కోంత కాలం పాటు కరీంనగర్ లో ఉండాలని నిశ్చయించుకున్నారని వినిపిస్తోంది.
దూకుడు పెంచిన కాంగ్రెస్..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది మెజారిటీ స్థానాలను గెలవాలని ప్లాన్ చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ మరోసారి ప్రధాని మోదీ చరిష్మాతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు ప్రచారాన్ని షురూ చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి... లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాల్లో నెగ్గాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ లో కోన్ని రోజుల పాటు మకాం వేసి... పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తారని ఇటీవల కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.