Hanuman Janmotsav 2024: కొండగట్టు భక్తజన సంద్రం- కాషాయ వర్ణంతో మెరిపోతున్న అంజన్న సన్నిధి
Kondagattu Ajanna News: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అంజన్న మాల వేసిన వాళ్లంతా విరమణ చేస్తున్నారు.
Anjaneya Swamy Temple Kondagattu: కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రెండు రోజుల నుంచి ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకల్లో భారీగా భక్తులు వచ్చి పాల్గొంటున్నారు. ముఖ్యంగా హనుమాన్ మాల ధరించిన భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు జై హనుమాన్ , శ్రీరామ నామంతో పరవశించిపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా ప్రత్యేకమైంది. ఏటా వేల సంఖ్యలో భక్తులు స్వామి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో ఆలయ పరిసరాలు కాషాయ వర్ణంతో చాలా చూడముచ్చటగా మారాయి. కొండగట్టు పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి మాలధారణ చేసిన వారంతా ప్రత్యేక వాహనాల్లో తరలి వస్తున్నారు. అక్కడకు వచ్చి మాల విరమణ చేస్తున్నారు.
రెండు రోజులుగా యాగశాలలో వేద పడింతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శుక్రవారం హోమం నిర్వహించిన పండితులు... ప్రత్యేకంగా సుంమదరకాండ పారాయణం చేశారు. కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో వేలమంది భక్తులు పాల్గొన్నారు. ఏటా వైశాఖ బహుళ దశమి రోజన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసందర్భంగా కొండగట్టు ఆలయంలో త్రైయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం చేపడతారు. దీన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.
ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్లు 11 రోజులు , ఇరవై ఒకరోజు, నలభై ఒకరోజు దీక్షలో ఉంటారు. చాలా మంది సొంతూళ్లలోనో లేక సమీపంలో పేరున్న హనుమాన్ టెంపుల్‌లో దీక్ష విరమణ చేస్తారు. మరికొందరు కొండగట్టుకు వచ్చి దీక్షను విరమిస్తారు. అయితే వారు ముందుగా స్నానం ఆచరించి తర్వాత ఇరుముడి దేవుడికి సమర్పించి అనంతరం విరమణ ప్రక్రియ చేపడతారు. ఈ ఏడాది తొలిసారిగా కొండ గట్టు ఆంజనేయ స్వామికి భద్రాచలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.