BJP Activists Arrest: విద్యుత్ బిల్లులపై బీజేపీ శ్రేణుల ధర్నా - నేతల అరెస్ట్
BJP Activists Arrest: ఏసీడీ విద్యుత్ బిల్లులపై హుజూరాబాద్ బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకొని నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
BJP Activists Arrest: గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ డిపాజిట్ ( అడిషనల్ కన్సమ్స్ డిపాజిట్ ) బిల్లుల పేరిట ప్రభుత్వం బిల్లులు వసూళ్లు చేస్తోంది. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ పిలుపు మేరకు ఏసీడీ విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో సహా 50 మంది బీజేపీ శ్రేణులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతుందని ఆయన మండిపడ్డారు. పేద మధ్య తరగతి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కేసీఆర్ సర్కారు చారణా ఖర్చు చేసి అక్రమంగా బారాణా దండుకుంటుందని దుయ్యబట్టారు. ముఖ్యంగా నేడు విద్యుత్ వినియోగదారుల విషయంలో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వేలల్లో వచ్చిన ఏసీడీ బిల్లులను చూసి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారన్నారని చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా విద్యుత్ వినియోదారుడైతే చాలు అన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవహరించడం దారుణం అన్నారు. సంక్రాంతి పండుగ మరొక ముందే ఏసీడీ డ్యూ పేరిట ప్రజానీకానికి విద్యుత్ షాక్ ఇచ్చినట్లు ఉందన్నారు.
విద్యుత్ బిల్లుతోపాటు ఏసీడీ మొత్తాన్ని కూడా చెల్లించాలని ప్రజానీకాన్ని ఒత్తిడి చేయడం అన్యాయం అని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వేలల్లో వచ్చిన బిల్లులు పేద మధ్య తరగతి ప్రజానీకం కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని భీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ఏడు సార్లు విద్యుత్ బిల్లులను గణనీయంగా పెంచిందని, కస్టమర్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలతో లోగడనే విద్యుత్ వినియోగదారులను అడ్డగోలుగా దోచుకుందని విమర్శించారు. నేడు ఏసీడీ పేరిట మళ్లీ బాదుడు మొదలు పెట్టిందని ఆరోపించారు. ప్రజల నుండి వేలాది రూపాయలు అక్రమంగా దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల గురించి ఆలోచన చేసే మనసుంటే తక్షణం ఏసీడీ డ్యూ బిల్లులను రద్దు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు జిల్లా కార్యదర్శి సీహెచ్ నరసింహ రాజు జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్ జిల్లా అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.