Karimnagar: ఈ ఊర్లో సాయంత్రం ఉండదు, మధ్యాహ్నం తర్వాత డైరెక్ట్‌గా రాత్రే! కరీంనగర్ జిల్లాలోనే
Moodu Jamula Kodurupaka: ఈ గ్రామం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద పెద్ద గుట్టల కారణంగా అక్కడ సాయంత్రం అనేది లేకుండా పోతోంది. మధ్యాహ్నం తర్వాత నాలుగు గంటల వరకే పూర్తిగా చీకటి ఆక్రమిస్తుంది.
సాధారణంగా ఒక రోజులో నాలుగు పూటలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లోని ఒక ఊర్లో మాత్రం కేవలం మూడు పూటలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆ ఊరి పేరే మూడు జాముల కొదురుపాకగా మారింది. నిజానికి పచ్చటి పొలాలతో చుట్టూ పారే కానాల వాగుతో చల్లటి గాలులు, స్వచ్ఛమైనగాలి నడుమ ఆ ఊరు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఈ గ్రామం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద పెద్ద గుట్టల కారణంగా అక్కడ సాయంత్రం అనేది లేకుండా పోతోంది. మధ్యాహ్నం తర్వాత నాలుగు గంటల వరకే పూర్తిగా చీకటి ఆక్రమిస్తుంది.
ఆ గుట్టల వల్లే నేరుగా చీకటి
దీంతో అక్కడి ప్రజలు కూడా సాయంత్రం సమయాన్ని చూడాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. ఈ ఊరికి చుట్టూ ఉన్న నాలుగు గుట్టలలో తూర్పున ఉన్న దానిని గొర్ల గుట్ట అని అంటారు. పడమరన ఉన్న దాన్ని రంగనాయకుల గుట్ట అనీ, దక్షిణాన ఉన్నది పాము బండ గుట్ట అనీ ఉత్తరాన నంబులాద్రి స్వామి గుట్ట ఉన్నాయి. ఇక తూర్పున ఉన్న గొర్ల గుట్ట గ్రామానికి పూర్తిగా అడ్డంగా ఉండడంతో సూర్యోదయం ఆలస్యం అవుతోంది. ఒకవైపు ప్రపంచమంతటా సూర్యకిరణాలు పరుచుకుని వెలుతురు ప్రసరిస్తూ ఉంటే దాదాపుగా గంట ఆలస్యంగా ఈ ఊరుపై కిరణాలు పడతాయి.
ఇక గ్రామానికి పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట కారణంగా సూర్యకిరణాలు పూర్తిగా నాలుగు గంటల వరకు మాత్రమే ఆ గ్రామంపై పడతాయి. దీంతో పూర్తిగా క్రమ క్రమంగా చీకటి ఊరంతా ఆవరించి ఉంటుంది. ఇక ప్రతి ఇంటిలోనూ, వీధిలోనూ రాత్రి మాదిరిగా పూర్తిస్థాయిలో లైట్లు వెలుగుతాయి. సాయంత్రం లేని ఈ ఊరికి ఎక్కడా లేని కొన్ని ప్రత్యేక సమస్యలు ఉన్నాయి.
ఇక్కడ జీవనశైలి విభిన్నం. సాధారణంగా ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉన్నవారు సైతం ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా ఆలస్యంగా మేలుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ కాబట్టి ఏదైనా పని చేసుకోవాలంటే తొందరగా తెల్లారదు. ఇక తెల్లారిందా పని మొదలు పెట్టడమే మంచిది. ఎందుకంటే త్వరగా చీకటి పడుతుంది కాబట్టి. మరోవైపు ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వారంతా వీలైనంత త్వరగా ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాపం ఈ గ్రామ ప్రజలకు ఉపాధి విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామాన్ని పర్యటక ప్రదేశంగా గుర్తిస్తే బాగుంటుంది అని, ఎక్కడెక్కడినుండో ఇక్కడి వింత వాతావరణాన్ని చూడటానికి వచ్చే బయటివారికి కనీస సౌకర్యాలు కల్పిస్తే తమకూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గ్రామస్తులు అంటున్నారు.