Karimnagar: కనువిందు చేస్తున్న లోవర్ మానేరు డ్యామ్, పోటెత్తున్న పర్యటకులు
Lower Manair Dam: లోయర్ మానేర్ డ్యాం గేట్లు తెరుస్తున్నారు అనే సమాచారం రావడంతో కరీంనగర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సందర్శకులు పెద్ద ఎత్తున ఎల్ఎండీ వైపు వచ్చారు.
Karimnagar Sri Raja Rajeshwara Reservoir: కరీంనగర్ పట్టణ శివారులో గల లోయర్ మానేర్ డ్యాంకి ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున నీరు రావడంతో మొత్తం 20 గేట్లను అధికారులు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల నుండి క్రమంగా నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అప్పటివరకు కేవలం ఒక ఫీట్ మాత్రమే తెరచి ఉన్న 20 గేట్లలో ఎనిమిది గేట్లు రెండు ఫీట్ల వరకు తెరిచారు. తరువాత మళ్లీ రాత్రి 8 గంటలకు 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా ఆదివారం రాత్రి వరకూ 21.345 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక డ్యాం రిజర్వాయర్ కి చేరుకుంటున్న నీటి ప్రవాహాన్ని గమనిస్తే శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ నుండి 5,130 క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు నుండి 16,513 క్యూసెక్కులు, ఎస్.ఆర్.ఎస్.పీ కాకతీయ కాలువ నుండి 2,300 క్యూసెక్కులు మొత్తంగా కలిపి 23 వేల ఎనిమిది వందల నలభై మూడు (23,843) క్యూసెక్కుల నీరు ఎల్ఎండీలోకి వస్తోంది. ఈ ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో ఇప్పటివరకు 20 గేట్ల ద్వారా మొత్తం 45,496 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి 10 గంటల సమయానికి ప్రాజెక్టులో 21.142 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
డ్యాం వైపు క్యూ కట్టిన జనాలు
లోయర్ మానేర్ డ్యాం గేట్లు తెరుస్తున్నారు అనే సమాచారం రావడంతో కరీంనగర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సందర్శకులు పెద్ద ఎత్తున ఎల్ఎండీ వైపు వచ్చారు. అలుగునూర్ వంతెన, ఉజ్వల పార్క్ డీర్ పార్క్, ఎల్ఎండీ వంతెన పరిసర ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారాయి. ఇరుపక్కల గేట్ల వద్ద ప్రజలు ఫోటోలు దిగేందుకు ఎగబడుతూ ఉండడంతో వారిని అదుపు చేసేందుకు ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇక చీకటి పడుతూ ఉండటంతో చాలా మంది ప్రజలను అక్కడి నుండి వీలైనంత త్వరగా పంపించే ప్రయత్నం చేశారు అధికారులు. లోయర్ మానేర్ డ్యాం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో లేక్ పోలీసుల సహాయంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులను నీటి ప్రవాహానికి వీలైనంత దూరంగా ఉండాలని అధికారులు కోరారు. నీటి మట్టం తగ్గిన తరువాత తిరిగి డ్యాం గేట్లు మూసివేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read: Chicken Rates : భారీగా తగ్గిన చికెన్ ధరలు, కరీంనగర్ లో రూ.100కే కిలో చికెన్