Karimnagar: గోల్డెన్ జూబ్లీలోకి కరీంనగర్ కంటి ఆసుపత్రి, 50 ఏళ్లుగా సేవలు
కంటి చూపు ప్రాధాన్యం గుర్తించిన లయన్స్ క్లబ్ సభ్యులు 1981లో రేకుర్తిలోని 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి కంటి ఆసుపత్రి నిర్మించారు.
సమాజ సేవే లక్ష్యంగా పెట్టుకొని, స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్న లైన్స్ క్లబ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో 1973 లో ప్రారంభమైన కరీంనగర్ లయన్స్ క్లబ్ 50 సంవత్సరాలుగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, సభ్యుల సహకారంతో నిధులను సమకూర్చుకుంటూ, వృద్దులు, మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు సాయం అందేలా ముందుకు సాగుతున్నారు. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది. కంటి చూపు ప్రాధాన్యం గుర్తించిన లయన్స్ క్లబ్ సభ్యులు 1981లో రేకుర్తిలోని 3.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి కంటి ఆసుపత్రి నిర్మించారు. అనుభవజ్ఞులైన వైద్యులు, అధునాతన యంత్రాంగాలను అందుబాటులోకి తెచ్చారు. ఏడు లక్షల మందికి పైగా సాధారణ కంటి వైద్యం 1.55 లక్షల మందికి పైగా ఉచితంగా ఆపరేషన్లు చేసి పేదలకు అండగా నిలిచారు.
అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు తక్కువ ధరకు అందిస్తున్నారు. మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి నేత్ర వైద్యం అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి రెటీనా చికిత్సలు ప్రారంభించనున్నారు. దూరప్రాంతల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి బంధువులకు భోజనం అందక చాలా ఇబ్బందులు పడుతుంటారు. డబ్బులు పెట్టి హోటల్లో తినలేక కడుపు మార్చుకొని ఉండేవారు. అలాంటి వారికి ఆకలి బాధను తీర్చాలనే ఉద్దేశంతో గత సంవత్సరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం 300 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రతి శనివారం మార్కెట్లోని గాంధీ రోడ్డులో 300 మందికి అన్నదానం చేస్తున్నారు.
మొదలైంది ఇలా..
1973లో అక్టోబర్ లో డాక్టర్ భాస్కర్ మాడేకర్, అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న ప్రధాన కార్యదర్శిగా ప్రారంభించిన కరీంనగర్ లయన్స్ క్లబ్ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వావిలాలపల్లి లో పార్కును అభివృద్ధి చేశారు. 20 ప్రభుత్వ పాఠశాలల్లో సిమెంట్ నీటి ట్యాంకులు, తీగల గుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.. 1921లో అందుల పాఠశాల ప్రారంభించారు.
కరీంనగర్ పట్టణంలో దహన సంస్కారాలకు ఇబ్బందులు పడకుండా 2008 లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సహకారంతో అలకాపురి కాలనీ లోని 4 ఎకరాలు స్మశాన వాటిక కోసం అభివృద్ధి చేసింది. రూ. కోటి రూపాయలు పెట్టి 12 దహన వాటికలు, బంధువులు స్నానాలు చేసేందుకు గదులు, వీక్షకుల గ్యాలరీ ఏర్పాటు చేశారు. శవాన్ని స్మశానానికి తరలించాలంటే వాహనదారులు ముందుకు రావడం లేదు.. ఒకవేళ వచ్చిన సాధారణ కిరాయి కంటే మరో మూడు రెట్లు ఎక్కువ ఇవ్వాల్సిందే. ఈ సమస్యను గుర్తించి అందుకు ఐదు వైకుంఠధామాలు, శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు ఏర్పాటు చేసి నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకొని పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఈ సంవత్సరం అక్టోబర్ 18 నాటికి కరీంనగర్ లైన్స్ క్లబ్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది. ప్రస్తుతం 50 వ అధ్యక్షుడిగా పని చేస్తున్న విద్యాసాగర్ రావు, గతంలో పని చేసిన అధ్యక్షులు, సభ్యుల కృషితోనే కంటి ఆసుపత్రి, శాంతి నివాసం ఏర్పాటై ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి నెల రూ.లక్ష రూపాయలు ఖర్చు చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటున్నామని తెలిపారు.