Karimnagar: వ్యాక్సినేషన్‌లో కరీంనగర్ అరుదైన రికార్డు.. తెలంగాణలోనే తొలి, దేశంలో రెండో జిల్లాగా గుర్తింపు
అత్యధిక వ్యాక్సినేషన్లు వేసిన జిల్లాగా కరీంనగర్ జిల్లా రికార్డు బద్దలు కొట్టడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా వైద్యాధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
వాక్సినేషన్ విషయంలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు జిల్లాలో రెండో డోస్ వేయడం కూడా 100 శాతం పూర్తయింది. రెండు డోసులు పూర్తి చేసుకున్న జిల్లాగా తెలంగాణలో రికార్డు నమోదు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డును సొంతం చేసుకుంది. మొత్తం జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు మొదటి డోస్ లక్ష్యానికి మించి 104 శాతం మందికి వ్యాక్సిన్ చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఈ ఫీట్ పూర్తి చేసిన తొలి జిల్లాగా కరీంనగర్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో నిలిచింది.
మంత్రి హరీష్ రావు అభినందనలు..
అత్యధిక వ్యాక్సినేషన్లు వేసిన జిల్లాగా రికార్డు బద్దలు కొట్టడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం తిరిగి లక్ష్యం కోసం కృషి చేసిన సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సరైన కో ఆర్డినేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని.. తెలంగాణలోని మిగతా జిల్లాలు సైతం కరీంనగర్‌ని అనుసరించాలంటూ ప్రశంసించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
నిజానికి కరీంనగర్ జిల్లా ఇప్పటికే మొదటి డోస్ విషయంలో వంద శాతం లక్ష్యాన్ని ఎప్పుడో అధిగమించింది. కరోనా బారిన పడిన బాధిత జిల్లాల్లో కరీంనగర్ అప్పట్లో ముందుండేది. అయితే వరుస కట్టడి విధానాలతోపాటు ముందు ముందు వచ్చే వేవ్‌లను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి ప్రణాలికను రూపొందించుకుంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మొదటి నుంచి కూడా వాక్సినేషన్ ప్రక్రియలో ఎంతో ముందంజలో ఉంది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే నిజామాబాద్, సూర్యాపేట, కొమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాలో 100 శాతం పూర్తయితే అన్ని జిల్లాల్లో కూడా నూటికి నూరు శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసిన రికార్డు తెలంగాణ సొంతం చేసుకోనుంది. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడి 2.77 కోట్ల మందికి వాక్సిన్ వేయాలని సాధారణంగా నిర్ణయించుకున్న టార్గెట్ కంటే ఎక్కువగానే 2.88 కోట్ల మందికి మొదటి డోస్ అంటే 104 శాతం వాక్సినేషన్ ప్రక్రియని ఇప్పటివరకు పూర్తిచేశారు.
Also Read: Nizamabad News: నిజామాాబాద్ జిల్లాలో పసుపు బోర్డుపై రాజుకున్న రాజకీయం.. కమలం, గులాబీ బాహాబాహీ