Karimnagar Cable Bridge: ప్రారంభించిన ఏడాదికే దారుణస్థితిలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, నాణ్యతపై విమర్శల వెల్లువ
Iconic Cable Bridge In Karimnagar | తెలంగాణలో హైదరాబాద్ తరువాత కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. కానీ ప్రారంభించిన ఏడాదికే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి రూపురేఖలు మారిపోయాయి.
Karimnagar Cable Bridge Repairs News | కరీంనగర్: బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ (Karimnagars Iconic Cable Bridge) ఇప్పుడు మామూలు స్థితికి వచ్చేసింది. వందల కోట్ల రూపాయలతో మానేరుపై నిర్మించిన ఈ కట్టడం ఏడాది తిరిగేసరికి దారుణ స్థితికి వచ్చేసిందని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఏడాది కిందట అట్టహాసంగా ప్రారంభించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అప్పుడే కళ కోల్పోయింది. కేబుల్ బ్రిడ్జి నాణ్యతపై స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది అత్యంత అట్టహాసంగా ప్రారంభించిన కరీంనగర్ తీగల వంతెన (Karimnagar Cable Bridge) ఇప్పుడు దయనీయ పరిస్థితుల్లో ఉంది. కరీంనగర్ టూరిజం లోనే బెంచ్ మార్క్ అవుతుందనుకున్న కరీంనగర్ బ్రిడ్జిపై ఇప్పుడు వాహనదారులు ప్రయాణం చేయలేని స్థితికి వచ్చేస్తోంది. సరిగ్గా ఏడాది కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూన్ 21న మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు చేసి మరి కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించింది. నాటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జి ప్రారంభమై నేటికి ఏడాది ఒక నెల పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత అద్భుత కట్టడంగా.. హైదరాబాద్ తర్వాత కేబుల్ బ్రిడ్జి ఉన్న ప్రాంతంగా కరీంనగర్ నిలుస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సుమారు 234 కోట్లు రూపాయలు ఖర్చు చేసి కట్టిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని ఓ ప్రముఖ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి నిర్మాణం చేపట్టారు. కానీ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది అలా అయిందో లేదో అప్పుడే శిథిలావస్థకు చేరుకోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా రిపేర్లు చేయాల్సిన స్థితికి కేబుల్ బ్రిడ్జి చేరుకుంది.
కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లేందుకు మరో మార్గంగా ఉపయోగపడుతున్న కేబుల్ బ్రిడ్జ్ ఏడాదికే రూపులేఖలు మారిపోయాయి. ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచిన అందమైన కేబుల్ బ్రిడ్జి నేడు ఓవైపు కంపుకొడుతూ, సరైన నిర్వహణ లేక కొంత సమయం కూడా దానిపై నిలబడలేని పరిస్థితి నెలకొంది. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమై ఆరు నెలలకే మరమ్మతులు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పటి ప్రభుత్వ నేతలకు చెందిన భూములు దీని చుట్టూ ఉన్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారని కరీంనగర్ ప్రజలు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి అయిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఏడాదికే దారుణమైన స్థితికి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.