Gadwala Accident: కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, లోపల 43 మంది - వెంటనే 2 లారీల మధ్య ఇరుక్కున్న బొలెరో
ఆర్టీసీ బస్సు కంటైనర్ ను ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ ప్రేమ్ రాజ్ చనిపోయారు. తీవ్ర గాయాలు అయిన అతణ్ని స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ఓ కంటైనర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కారణంగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే రెండు లారీల మధ్యన బొలేరో వాహనం చిక్కుకుపోయింది. ఆ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోవడంతో స్థానికులు శ్రమించి అతణ్ని బయటికి తీశారు.
ఆర్టీసీ బస్సు కంటైనర్ ను ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ ప్రేమ్ రాజ్ చనిపోయారు. తీవ్ర గాయాలు అయిన అతణ్ని స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద ఈ ఆర్టీసీ బస్సు - కంటైనర్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయాలు అయిన వారిని పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జనగామలో మరో ప్రమాదం
జనగామ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ తవేరా వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రహదారిపై వాహనాన్ని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.