సింగరేణిలో పేలిన తుపాకీ- పరుగులు పెడుతున్న పోలీసులు
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గంగానగర్‌లో జరిగిన సింగరేణి కార్మికుని హత్య ఘటన కలకలం రేపింది. చాలా కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్‌లో గన్ కల్చర్ ఆనవాళ్లు సంచలనం కలిగిస్తున్నాయి.
రోజంతా శ్రమించి ఇంటిలో నిద్రపోతున్న బొగ్గుగని కార్మికుడిపైకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఏం జరిగిందో తెలిసేలోపే అతడు నిద్రలోనే కన్నుమూశాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేసిన నేరగాళ్లు వచ్చిన దారినే సునాయాసంగా తప్పించుకొన్నారు. చాన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది.
మళ్లీ గన్ కల్చర్ ఆందోళనలు
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గంగానగర్‌లో జరిగిన సింగరేణి కార్మికుని హత్య ఘటన కలకలం రేపింది. చాలా కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్‌లో గన్ కల్చర్ ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పథకం ప్రకారమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
నిద్రలో ఉండగానే హత్య
గంగానగర్‌కు చెందిన కొరికొప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుడిని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. రాజేందర్ నిద్ర మత్తులో ఉండగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా ఆర్కే న్యూటెక్ అనే బొగ్గుగనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేసే రాజేందర్ నిత్యం అక్కడినుంచి ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవాడు. భార్య ఇద్దరు పిల్లలతో నివసించే అతడు... నిన్న మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత... నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా కొంతమంది వ్యక్తులు రాత్రి రెండున్నర తర్వాత వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డీసీపీ మాట్లాడుతూ ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
మళ్లీ ఒకప్పటి పరిస్థితులు?
గతంలో సింగరేణి ప్రాంతంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉండేవి. పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల క్రమంగా అదుపులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు స్థానిక రౌడీషీటర్లు... హిస్టరీ షీటర్‌లని స్టేషన్‌కు పిలిపించుకొని వారి ప్రస్తుత వృత్తి, జీవన విధానంపై ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. రామగుండంలో రైల్వే జంక్షన్ ఉన్నందున నేరస్తులు సులువుగా పారిపోవడం లేదా బయటినుంచి కిరాయి వ్యక్తులతో తమ చేతికి మట్టి అంటకుండా నేరాలు చేయించడం జరిగేది. అయితే... టెక్నాలజీని వినియోగించి పోలీసులు ఎప్పటికప్పుడు నేరస్థుల కదలికలపై నిఘా వేసి ఉంచినందున క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. తుపాకీల వినియోగం లాంటి సీరియస్ నేరాలు దాదాపుగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కాల్పులు, హత్య ఘటన సింగరేణి వాసుల్లో భయాందోళనలు రేపుతోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read:జనసంద్రంగా మారిన మునుగోడు- కేసీఆర్ స్పీచ్‌తో ఫుల్ జోష్