KCR News: కేసీఆర్ చూపు కరీంనగర్ వైపు, ఈసారి ఎంపీ అభ్యర్తిగా బరిలోకి? ఒకే దెబ్బకు రెండు పిట్టలు కూడా!
గతంలో రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మొదటి నుండి గట్టి పట్టున్న కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని తన తదుపరి లక్ష్యంగా కేసీఆర్ ఎంపిక చేసుకుంటున్నట్లు జిల్లాలోని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి తొలినాళ్ళలో నిర్వహించిన "సింహ గర్జన" ద్వారా అటు పార్టీకి, ఇటు ఉద్యమానికి కరీంనగర్ మరోసారి వేడి పుట్టించే రాజకీయాలకు వేదికగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ కి కరీంనగర్ లో మంచి ట్రాక్ రికార్డు
గతంలో రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు. కాబట్టి, ఢిల్లీ కేంద్రంగా తన వాయిస్ ని బలంగా వినిపించాలన్నా తిరిగి తనకి, ఇటు పార్టీకి పట్టున్న కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలవడమే కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు వరుసగా కేంద్రంలోని బీజేపీపై అలాగే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ వాగ్బాణాలతో దేశవ్యాప్తంగా వేడిని పుట్టిస్తున్న కేసీఆర్ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సిద్ధపడే 2024 ఎన్నికల్లో తనకు సెంటిమెంట్‌గా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుండి పోటీకి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్త ఫ్రంట్?
ఒకవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుండి సానుకూల సంకేతాలు వెలువడుతున్న తరుణంలో జాతీయస్థాయి రాజకీయాల్లో ఒక కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫ్రంట్‌లో కీలక స్థానంలో తాను ఉంటూ, ముఖ్య భూమిక పోషిస్తానని కూడా కేసీఆర్ గతంలో చెప్పారు. మరోవైపు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో మరోసారి తమ ప్రభావాన్ని చూపాలని చూస్తున్నారు. పైగా ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ తో పాటు తనకు ఎదురుగా నిలిచి కీలక సమయంలో దెబ్బకొట్టిన ఈటల రాజేందర్ ని నిలువరించడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే ఆలోచన కూడా గులాబీ పెద్ద మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా వారి ప్రాభవం తగ్గించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌కు ప్రతి సవాల్ విసిరి మరీ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దారుణమైన దెబ్బ కొట్టారు కేసీఆర్.
కరీంనగర్ ఎంపీగా ఇదీ కేసీఆర్ ట్రాక్ రికార్డు
2004లో అప్పటి కేంద్ర మంత్రి సీనియర్ బీజేపీ నాయకుడైన చెన్నమనేని విద్యాసాగర్ రావుపై 1,31,138 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందారు. ఇది ఉద్యమ సమయంలో చాలా కీలకంగా మారింది. తర్వాత రాజకీయ సవాళ్ల ద్వారా అనివార్యమైన 2005 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 2,01,582 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో అటు ఉద్యమాన్ని, ఇటు పార్టీని కేసీఆర్ చాకచక్యంగా గాడిన పడేయగలిగారు. 2008లో తిరిగి ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్ నుండే పోటీ చేయగా కేసీఆర్‌ని ఓడించేందుకు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పూర్తిస్థాయిలో ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. అతి తక్కువ మెజారిటీ 15,765తో కేసీఆర్ గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావడంతో వివిధ స్థానాల్లో సన్నిహితులను గెలిపించుకున్న కేసీఆర్, మళ్ళీ బీజేపీ దూకుడుతో కోల్పోతున్న పట్టుని మళ్ళీ సాధించడానికి తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.