KA Paul : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, 119 స్థానాల్లోనూ పోటీ చేస్తాం - కేఏ పాల్
KA Paul : తెలంగాణలో వచ్చే ముందస్తు ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు.
KA Paul : మరో ఆరు నెలల్లో వచ్చే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సేవ్ తెలంగాణ యాత్రలో భాగంగా కేఏ పాల్ కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో ఆ పార్టీ కార్యకర్తలతో కేఏ పాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తామని ఎన్నికల సంఘం తనకు హామీ ఇచ్చిందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి పడిన ఓట్లన్నీ ఈవీఎంలు మార్చి బీజేపీ, టీఆర్ఎస్ గుంజుకున్నాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలను రక్షించే సత్తా తనకే ఉందన్నారు.
సజ్జల మాటలు నమ్మొద్దు
"గద్దర్ పై ఒత్తిడి తేవడం వల్లే ఆయన మునుగోడు పోటీ నుంచి వెనక్కి తగ్గారు. గద్దర్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. గద్దర్ కు రూ.200 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కానీ గద్దర్ అలాంటివారు కాదని నాకు తెలుసు. షర్మిల చెల్లీ.. నీవు ఏపీలో 7000 కిలోమీటర్లు నడిచి మీ అన్నను ముఖ్యమంత్రిని చేస్తే ఆ రాష్ట్రం ఏం బాగుపడిందని ఇక్కడ తిరుగుతున్నావు. అప్పులు చేసి అభివృద్ధి చేస్తానంటావా?. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం. నేను తెలంగాణ ఏర్పాటు ఉద్యమ సమయంలో మద్దతు ఇచ్చాను." - కేఏ పాల్
కేఏ పాల్ పాదయాత్ర
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా బండి సంజయ్, షర్మిల బాటలో నడుస్తున్నారు. తరచూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఏ పాల్ కూడా పాదయాత్ర బాటపట్టారు. తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోతున్నానని పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు, విద్యార్థి, కుల సంఘాలతో నల్గొండలోని ఎస్ఆర్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో భేటీ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు. తాను వారం రోజుల పాటు అమెరికాకు వెళ్లి వచ్చానని, తాను వచ్చేలోపు ఐటీ దాడులు, షర్మిల పాదయాత్రలో ఘటనలు ఇలా రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందన్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీలోకి దిగబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ పార్టీ తరపున అభ్యర్థులను అన్ని స్థానాల్లో బరిలోకి దింపుతానని తెలిపారు. షర్మిల వార్తలను కవర్ చేయవద్దని మీడియాకు సూచించారు. కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఐటీ దాడుల్లో టీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో పాదయాత్ర చేస్తున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. మునుగోడులో గెలిస్తే 15 రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ ఇప్పటి వరకు అసలు పట్టించుకోలేదన్నారు.