Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ముగ్గురు బి.ఆర్.ఎస్ (బండి, రేవంత్, షర్మిల) లు ఏకమయ్యారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
![Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల Karimnagar Minister Gagula Kamalakar alleged Bandi Revanth Sharmila combined to defeat BRS CM KCR DNN Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/02/4e8c73b0fe63fb902ef57f7735d3f85a1680431188760235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Gangula Kamalakar : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ముగ్గురు బీ.ఆర్.ఎస్ లు ఏకమయ్యారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....నా బలమే కార్యకర్తలు అని, ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టేనని, నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని అన్నారు. మనమందరం సీఎం కేసీఆర్ బలగమని, మనమంతా ఐకమత్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని మరింత బలపేతం చేసుకుందామన్నారు. తెలంగాణ రాకముందు మనమందరం ఉన్నామని, ఎంతో మంది సీఎం, పీఎంలు వచ్చారు పోయారే తప్ప మనకోసం చేసిందేమి లేదన్నారు. కానీ మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు. సమైక్య పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసిన రోజులు ఉండేవన్నారు.
మనమంతా ఒక కుటుంబం
తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్, తాగునీటి ఇబ్బందిలేకుండా చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దరిద్ర్యాన్ని తొలగిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టే మన వనరులను మనం సంరక్షించుకొని వాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. పచ్చని తెలంగాణను చూసి విపక్షాలకు, కడుపు మంట, కళ్ల మంట ప్రారంభం అయిందని, మన వనరులను కొల్లగొట్టాలని, రాజ్యాధికారం కావాలని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం దిల్లీలో ఉందని అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఇక్కడి వనరులను దోచుకోవడానికి చూస్తున్నారని అన్నారు. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇదే విషయం చెప్తారని అన్నారు. మనమంతా ఒక కుటుంబమని.. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహాజమని వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుందామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చేతులకు మనమంతా బలం కావాలని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని క్రమశిక్షణ కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని అందరూ క్రమశిక్షణ దాటొద్దని సూచించారు.
బండి సంజయ్, రేవంత్ కు షర్మిల ఫోన్
వైఎస్సార్ టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిద్దరినీ కోరారు. అందరూ కలిసి కార్యాచరణ చేస్తేనే.. ప్రజల సమస్యలను పరిష్కరించగలమని వివరించారు. అలాగే ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిచ్చి అంతా కలిసి నడుద్దామని సూచించారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... త్వరలోనే సమావేశం అయి అన్ని విషయాలపై చర్చిద్దామన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)