Filigree Products: అంబానీ ఇంట పెళ్లి వేడుక కోసం కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు - అసలు ప్రత్యేకత ఏంటో తెలుసా?
Filigree: వెండితీగతో అద్భుత కళాకృతులు రూపొందించే గొప్ప కళ ఫిలిగ్రీ. ఈ ఉత్పత్తులకు కరీంనగర్ పెట్టింది పేరు. అంబానీ ఇంట పెళ్లి వేడుకకు సైతం వీటిని బహుమతులుగా ఇస్తున్నారు. మరి దీని ప్రత్యేకత ఏంటో తెలుసా!
Karimnagar Filigree Products As Gifts Of Ananth Ambani Marriage Event: ఫిలిగ్రీ.. వెండి తీగతో ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను కళాకారులు రూపొందించే గొప్ప కళ. పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన కాలం నుంచే ఉన్న ఈ కళ.. ఇండోనేషియా, ఒడిశా నుంచి కరీంనగర్‌కు (Karimnagar) చేరింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక సందర్భంగా మరోసారి ఈ కళ చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను వివాహ వేడుకకు వచ్చే ప్రముఖులకు బహుమతులుగా ఇవ్వాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. దీంతో దాదాపు 400 వస్తువులకు ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్ కుమార్‌లు తెలిపారు. జులైలో జరిగే వివాహ వేడుక కోసం జ్యుయలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ వంటి వస్తువులను ఆర్డర్ చేసినట్లు చెప్పారు.
ఇదీ చరిత్ర
కాకతీయ కాలంలోనే ఫిలిగ్రీ కళకు (Filigree) మంచి గుర్తింపు పొందింది. నిజాం కాలంలో నవాబులు ఫిలిగ్రి వస్తువులను తయారు చేయించున్నట్లుగా చరిత్ర చెబుతోంది. నాలుగు దశాబ్డాల నాటి ఫిలిగ్రి హస్త కళకు కరీంనగర్ కళాకారులు జీవం పోస్తున్నారు. మనసు దోచే వెండి జాలీల అల్లికల ఈ కళ కుతుబ్ షాహి, అసబ్ జాహి, గోల్కొండ నవాబుల ఆదరణతో అభివృద్ది చెందుతూ వచ్చింది. నిజాం రాజుల విలాసవంతమైన జీవితాలకు సిల్వర్ ఫిలిగ్రీ మరింతగా వన్నె తెచ్చింది. వెండి వస్తువులను కలిగి ఉండడం అప్పట్లో హోదాగా భావించేవారు. మొదట్లో అత్తర్ ధాన్‌లు, పాన్ ధాన్, వెండి కంచాలు, ట్రేల వంటి వస్తువులు తయారు చేశారు. కాగా, పాత తరం వస్తువులకు కాలం చెల్లడంతో కొత్త కళాఖండాలు తయారు చేయడంపై కరీంనగర్ కళాకారులు దృష్టి సారించారు.
ఇలా చేస్తారు..
సృజనాత్మకత, ఏకాగ్రత జామెట్రి కొలతల ప్రావీణ్యం అన్నీ కలిస్తే సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్. కావాల్సిన ఆకృతిని తయారు చేసేందుకు ముందుగా కొలతలు తీసుకొని డయాగ్రాం తయారుచేస్తారు. తర్వాత వెండి తీగలను కావాల్సిన సైజుల్లో కత్తిరిస్తారు. అలా కత్తిరించిన ముక్కలను ఫ్రేముల్లో అమర్చుతు తుది రూపాన్ని తీసుకువస్తారు. తరువాత డయాగ్రాంలో కావాల్సిన ఆకృతిలో పేర్చిన వెండి తీగ ముక్కలను అతికిస్తారు. చిన్న వెండి ముక్కలు కావడంతో వాటిని పేర్చే క్రమంలో ఓపిక అనేది చాలా ముఖ్యం. 20 యేళ్లుగా అద్బుతమైన వస్తువులను తయారు చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు కరీంనగర్ కళాకారులు.
విదేశాల్లోనూ..
ప్రపంచంలోనే అరుదైన కళగా గుర్తింపు పొందిన సిల్వర్ ఫిలిగ్రీ తరువాత కాలంలో కరీంనగర్ నుంచి లండన్ వరకు వ్యాపించింది. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల భారీ ఫిలిగ్రీ నెమలిని బహూకరించింది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికై మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన వెంకయ్యనాయుడికి రెండున్నర కిలోల కాకతీయ కళాతోరణాన్ని కానుకగా అందించింది. పారిశ్రామికవేత్తల సదస్సుకు హజరైన అమెరికా అద్యక్షుడు ట్రంప్ కుమర్తె ఇవాంకాకు ఫిలిగ్రీ నెమలిని బహూకరించారు. కరీంనగర్‌లో తయారైన డ్రెస్సింగ్ సెట్‌ను నిజాం రాజు బ్రిటర్ రాణి ఎలిజిబెత్‌కు బహూకరించినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఇక జీ 20 దేశాల సమావేశం భారత్ లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపైనా కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు.
అలా అంబానీ ఫ్యామిలీని చేరి
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్యామిలీ కూడా వినడంతో దాదాపు ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుంచి కూడా అంబానీ ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని నిర్వాహకులు చెప్తున్నారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 400 వస్తువులకు అంబానీ నుంచి ఆర్డర్లు వచ్చాయని నిర్వహకులు చెప్తున్నారు. వారి కోరిక మేరకు ఆర్డర్లు తయారు చేసి అందిస్తున్నామని తెలిపారు.