Etala : మమ్మల్ని మూడు తోకలంటారా ? -కేసీఆర్ ఆధికారాన్ని ప్రజలు పీకేస్తున్నారు : ఈటల
కేసీఆర్ పదవిని పీకేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ ప్రకటించారు. బీజేపీకి ఉన్నది మూడు తోకలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.
Etala : తెలంగాణ బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్ని మూడు తోకలుగా పోల్చిన సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ మండిపడ్డారు. రెండే సీట్లు ఉన్న బీజేపీ 303 సీట్లతో పార్లమెంట్ మీద జెండా ఎగురవేసిందనే సంగతిని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారన్నారు. విర్రవీగిన వారిని ప్రజలు మట్టి కలిపించారన్నారు. కెసిఆర్ చెప్పే మాటకి చేసే పనులకు సంబందం లేదు అని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. నాలాంటి వాడిని ఓడించడానికి హుజూరాబాద్ లో ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మద్యం తాగించిన ప్రజలు గెలిపించారని.. గుర్తు చేశారు.
కెసిఆర్ నామొఖం చూడవద్దు అని నిర్ణయించుకొని అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలు కెసిఆర్ ను అసహ్యించుకుంటున్నారు. బిడ్డ నీ అధికారం పీకేస్తాం అని ప్రజలు అంటున్నారన్నారు. మేక వన్నె పులి కెసిఆర్ అనే మాట నిజం అయ్యిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత.. 500 పైబడి ఉన్న సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ...తెలంగాణ విమోచన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అందులో 12 మంది హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో రక్తం చిందించారు. అదిలాబాద్ లో రాంజీ గోండు తిరుబాటు చేస్తే వెయ్యిమంది మర్రి చెట్టుకు కట్టి కాల్చి చంపారు. గుండ్రాం పల్లి, బైరాన్ పల్లి, పరకాలలో ఎంతోమంది ప్రాణాలర్పించారన్నారు.
తెలంగాణ ఉద్యమం, రైతాంగ పోరాటం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం, 69 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం.. ఏ ఉద్యమంలో అయిన అమరత్వం లేకుండా లేదని ఈటల స్పష్టం చేశారు. అలా సాధించుకున్న తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకొనే భాగ్యం మనకు దక్కలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకున్నారు తప్ప మన వేడుకలు జరపలేదని.. విమోచన దినోత్సవానికి మొట్ట మొదట తూట్లు పొడిచిన వ్యక్తి కెసిఆర్ అని మండిపడ్డారు. 25 సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేస్తుంది, కేసులు పెట్టించుకొని అయినా పోరాడుతుందని తెలిపారు.
ఆనాడు హోం మంత్రి సర్దార్ పటేల్ తెలంగాణను విమోచన చేస్తే ఈనాడు మన హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ గడ్డమీద జాతీయ జెండా ఎగురవేయబోతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగుర వేస్తాం అంటున్నారు. తోకముడిచిన కెసిఆర్ గారు మళ్లీ మనవెనుక నడుస్తున్నారు. కెసిఆర్ కి ఓట్లు, సీట్లు తప్పప్రజలమీద నమ్మకం గౌరవం లేదు అనడానికి ఇది నిదర్శనమని ఈటల మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో స్మృతి వనాలు నిర్మిస్తాం. వీరి త్యాగాలు రాబోయే తరాలకు అందజేస్తమని హామీ ఇచ్చారు. అమరులస్ఫూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసి రీతిలో ముందుకు పోదాం అని బీజేపీ శ్రేణులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.