Minister Errabelli : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం - మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli : అకాల వర్షాలతో నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు.
Minister Errabelli : ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గాలి వానతో రైతాంగాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. శనివారం సాయంత్రమే సంబంధిత జిల్లాల కలెక్టర్లను, అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన మంత్రి, ఆదివారం... వానలకు నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనగామ కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులతో కలిసి సమీక్ష చేశారు. జరిగిన పంట నష్టాల అంచనాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి జనగామకు సమీపంలో ఉన్న పెద్ద పహాడ్ గ్రామంలో పంట నష్టాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
రైతులకు తగిన పరిహారం అందిస్తాం
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితమే ప్రకృతి బీభత్సానికి రైతాంగం బలైంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఆయా చోట్ల పర్యటించి, రైతుల పంట నష్టాలను పరిశీలించారు. రైతులకు భరోసా కల్పించారు. పరిహారం గతంలో ఎక్కడా ఎన్నడూ ఇవ్వనంతగా ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నష్టాలు రైతులు మరచిపోకముందే, మరోసారి వడగండ్లు, అకాల వర్షాలు కురవడం దురదృష్టం అన్నారు. ప్రకృతి ప్రకోపిస్తే, తట్టుకోవడం తప్ప చేసేది లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు జనగామ జిల్లాలోనే ప్రారంభించుకున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. దీంతో కొంత నష్టాలు తగ్గాయన్నారు. ఇంకా పంట చేతికి వచ్చే ముందే కురిసిన వర్షాలకు రైతుల విలవిలలాడుతున్నారన్నారు. వారిని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు, స్వయంగా రైతు, రైతు కష్టాలు తెలిసిన వారు కాబట్టి తప్పకుండా ఆదుకుంటారన్నారు. రైతాంగం సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన పరిహారం అందేలా చూస్తామని వివరించారు. అలాగే అధికారులు వెంటనే రంగంలోకి దిగాలని, స్వయంగా క్షేత్రాలకు వెళ్ళి, రైతులతో మాట్లాడి, పంట నష్టాలను అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష, పంట నష్టాల పరిశీలనలో మంత్రి ఎర్రబెల్లితోపాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా అక్కడక్కడ కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా పంటలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేయడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన రిపోర్టులు తెప్పించాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో కల్లాల్లో ఎండబోసిన ధాన్యం కుప్పలు శనివారం (ఏప్రిల్ 22) కురిసిన అకాల వర్షంతో నీట మునిగాయి. వరదలో వడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి జిల్లాలోనూ వర్షంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, జమ్మికుంట, సైదాపూర్, మానకొండూరు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. వర్షం దాదాపు గంటకు పైగా కురవడంతో మార్కెట్ యార్డులోకి పై నుంచి వచ్చే వరదతో వడ్లన్నీ కాల్వలో కొట్టుకుపోయాయి. కొన్ని కోళ్ల షెడ్డు కూలి కోళ్లు చనిపోయి తీవ్ర నష్టం కలిగింది.