YS Sharmila : అవినీతిపై ప్రశ్నిస్తే దాడులా?, ప్రజలు చెప్పులతో కొట్టే రోజు దగ్గర్లోనే - వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్ఆర్టీపీని కనీసం పార్టీగా గుర్తించమన్న టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు భయంపట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో వైటీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తింది. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ... తన పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాదయాత్ర ఫ్లెక్సీలు చించేశారని, తమ నాయకులను కొట్టారన్నారు. చామనపల్లిలో దాడులు జరుగుతుంటే పోలీసులు ఉండి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, కేసులు పెట్టలేదన్నారు. నైట్ క్యాంప్ ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. పాదయాత్రలో మేం టెంట్ లు వేసుకొని ఉంటున్నామని, చలికాలం అయి ఉండి కూడా మేం టెంట్ లు వేసుకొని రోడ్ల పైనే పడుకుంటున్నామన్నారు.
పోలీసులా, టీఆర్ఎస్ కార్యకర్తలా?
"టీఆర్ఎస్ నేతలు అసలు మనుషులేనా? మానవత్వం లేదా?. అధికారం రాగానే మృగాలుగా మారారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల వైపే నిలబడ్డారు. టీఆర్ఎస్ నేతలుగా పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులకు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత లేదా?. పోలీసులు గులాబీ కండువాలు..గులాబీ నిక్కర్ లు వేసుకొని తిరగండి. ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకొని టీఆర్ఎస్ నేతలకు ఊడిగం చేస్తారా?. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై దాడులు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తారా?. మేము పాదయాత్ర చేయకూడదా?. మేము ప్రజల పక్షాన నిలబడకూడదా? మీ అవినీతిని ప్రశ్నించ కూడదా?. పాదయాత్రలో అడుగడుగునా ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి బయటపడుతుంది. "- వైఎస్ షర్మిల
సమాధానం చెప్పే దమ్ముందా?
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నోరు విప్పడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అందరినీ కొనేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా? అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడటం నేరమా? అని నిలదీశారు. ప్రజల తరుపున ఆలోచన చేయడం తప్పా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ఇంత అవినీతికి పాల్పడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదన్నారు. అవినీతి, అక్రమాల మీద సమాధానం చెప్పే దమ్ము లేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పే విషయం ఉంటే ప్రజాక్షేత్రంలో మైకు పట్టుకొని సమాధానం చెప్పండని సవాల్ చేశారు. అవినీతి పరులు కాబట్టి సమాధానం చెప్పే చేతకాదన్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి సమాధానం చెప్పే దమ్ము లేదన్నారు. ఇంతకాలం మాది పార్టీ కాదని పట్టించుకోం అన్నారని, ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో ఆదరణ లేదని అనుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారన్నారు.
చెప్పులతో కొట్టే రోజులు
"వైఎస్ఆర్ తెలంగాణ గడ్డకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. వైఎస్సార్ పెట్టిన పథకాలతో ఈ గడ్డ కూడా ఎంతో లబ్ది పొందింది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ పథకాలతో ఎంతో మేలు జరిగింది. అందుకే వైఎస్సార్ ను తెలంగాణ గడ్డ ఇంకా గుర్తు పెట్టుకుంది. వైఎస్సార్ చనిపోతే ఈ గడ్డ మీద 700 మంది గుండె పగిలి చనిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకునే దమ్ము లేదు కానీ దాడులు చేస్తారా?. టీఆర్ఎస్ నేతలు వెనక ఉంటారు..కార్యకర్తలను ముందు పెడతారు. కార్యకర్తలు ఆలోచన చేయండి.. మీకు ఇళ్లు ఎవరు ఇచ్చారు. వైఎస్సార్ ఏం చేశారు కేసీఆర్ చేసిన మోసం ఏంటో గ్రహించాలి. వైఎస్సార్ బిడ్డగా హెచ్చరిస్తున్నా వైఎస్సార్ ఫ్లెక్సీలు, విగ్రహాల జోలికి వస్తే ప్రజలు సహించరు. ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీ తాటాకు చప్పుళ్లకు YSR బిడ్డ భయపడేది కాదు. "- వైఎస్ షర్మిల