(Source: Poll of Polls)
Dalit Bandhu Dangerous Political Game: కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమం కంటే క్లిష్టమైన సవాల్ దళిత బంధు!.. "సింహం మీద సవారీ" అని ఎందుకు అంటున్నారు?
"దళిత బంధు" పథకం అమలును సింహంపై సవారీగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభివర్ణించారు. అది నిజమేననని తెలంగాణ ఉద్యమం కంటే నేర్పుగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాల్సి ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ "దళిత బంధు" పథకం అమలుపై కొత్త చర్చ ప్రారంభమయ్యేలా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై నుంచి ప్రసంగించిన ఆయన దళిత ఉద్ధరణ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆ పథకం అమలు గురించి చెబుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా మొత్తం అమలు చేస్తామని ఇతర చోట్ల పాక్షికంగా అమలు చేస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ నోటి వెంట వచ్చిన ఆ "పాక్షికంగా అమలు" అన్న మాటలపైనే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. " అంటే ... అందరికీ దళిత బంధు రాదా..?" అనే సందేహమే ఈ చర్చలకు మూలం.
మొదటగా నియోజకవర్గానికి వంద మందికి "దళిత బంధు" నిర్ణయం..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 27వ తేదీన అఖిలపక్ష దళిత నేతలతో సమావేశం నిర్వహించారు. దళితుల్ని ఆర్థికంగా ఎలా పైకికి తీసుకురావాలో మేథోమథనం చేయడమే ఆ సమావేశ లక్ష్యం. కొన్ని పార్టీలు తప్ప అందరూ హాజరయ్యారు. ఆ సమావేశంలో దళిత ఎంపవర్‌మెంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. వెయ్యి కోట్లను ఎలా వారి అభివృద్దికి వెచ్చించాలో అందరి దగ్గరా సలహాలు సూచనలు తీసుకున్నారు. దాని ప్రకారం సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వచ్చింది. దాని ప్రకారం " దళిత ఎంపవర్‌మెంట్ స్కీం " కింద... మొదటి ఏడాది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి పథకం అమలు చేయబోతున్నామని ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున నగదు బదిలీ చేయడం పథకం ఉద్దేశమని ప్రకటించారు. పథకం అమలు.. ఇతర ఖర్చులు కాకుండా లబ్దిదారుల కోసమే రూ.1,190 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించారు. అవసరం అయితే మరో రూ. వెయ్యి కోట్లయినా వెచ్చిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. నియోజకవర్గానికి వంద మంది లబ్దిదారులు అంటే.. ప్రభుత్వం మంజూరు చేస్తామన్న మొత్తం సరిపోతుంది.
Also Read: Telangana News Live Updates: మధ్యాహ్నం హుజూరాబాద్‌కు కేసీఆర్.. సభా ప్రాంగణం ప్రత్యేకత ఏంటంటే..
తర్వాత హుజురాబాద్‌లో దళిత కుటుంబాలన్నింటికీ వర్తింపు..!
"దళిత ఎంపవర్‌మెంట్ స్కీం" పేరును జూలై 18వ తేదీన "తెలంగాణ దళిత బంధు"గా కేసీఆర్ ఖరారు చేశారు. అంతకు ముందు రైతు బంధు పేరుతో ఆయన పెట్టిన పథకం రైతుల్లో తెలంగాణ సర్కార్‌కు.. కేసీఆర్‌కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఓ రకంగా టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకం ద్వారా పంపిణీ చేసిన చెక్కులే కీలక పాత్ర పోషించాయని ఎన్నికల నిపుణులు విశ్లేషించారు. ఆతరహాలోనే ఇప్పుడు దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. పథకం పేరును ఖరారు చేసిన రోజే.. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని ప్రకటించారు. అక్కడ సంతృప్త స్థాయిలో పథకం అమలు కోసం అదనంగా రూ.1,500 నుంచి రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. అంటే... తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు కోసం వెచ్చిస్తామన్న నిధులు మొత్తం ముందుగా హుజురాబాద్‌కే కేటాయించాలని నిర్ణయించారని స్పష్టమైంది.
Also Read: Telangana News: వీళ్లందరికీ కేసీఆర్ శుభవార్త, ఉద్యమంలా తీసుకుపోదామని గోల్కొండ వేదికగా సీఎం వెల్లడి
ఆ తర్వాత రూ. లక్ష కోట్లయినా వెచ్చించి తెలంగాణ దళిత కుటుంబాలన్నింటికీ వర్తింప చేస్తామని ప్రకటన..!
హుజూరాబాద్ దళితులందరికీ "దళిత బంధు" పథకం అందించాలని కేసీఆర్ నిర్ణయించే సరికి విపక్షాలు ఉలిక్కిపడ్డాయి. అది రాజకీయంగా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించాయి. ఈ ఆరోపణలపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. "అవును రాజకీయ లబ్ది"కోసమేనని నిర్మోహమాటంగా ప్రకటించారు. అయితే విపక్ష పార్టీలు ఈ అంశాన్ని మరో విధంగా ప్రజల్లో ప్రచారం చేయడం ప్రారంభించాయి. ఉపఎన్నికలు వస్తే మాత్రమే ప్రభుత్వం సాయం చేస్తుందని... రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు చెందాల్సిన పథకం నిధులను హుజురాబాద్‌లో మాత్రమే పంపిణీ చేస్తున్నారని విమర్శలు ప్రారంభించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హుజురాబాద్ స్థాయిలో దళిత బంధు కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీనికి చెక్ పెట్టడానికి సీఎం కేసీఆర్ .. పథకంపై జరిగిన ఓ సమీక్ష సమావేశంలో రూ. లక్ష కోట్లు అయినా దళిత బంధు కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తించబోతోందన్న నమ్మకానికి వారంతా వచ్చారు.
ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లో "పాక్షిక అమలు" ప్రకటనతో సందేహాలు..!
రూ. లక్ష కోట్లయినా వెచ్చిస్తామని చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ హఠాత్తుగా తన దత్తత గ్రామం వాసాల మర్రిలో పర్యటించారు. ఆ గ్రామంలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు సాయం ప్రకటించారు. ఆ తర్వాతి రోజే ఆ గ్రామ దళితులకు నిధులు విడుదల చేశారు. దీంతో కేసీఆర్ ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తారన్న నమ్మకం బలపడటానికి కారణం అయింది. గతంలో కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడక పంచాయతీ గ్రామాల్లోని 1,276 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇచ్చారు. కేసీఆర్ అనుకుంటే ఇస్తారన్న నమ్మకం ఈ కారణాలతో బలపడింది. అందరికీ దళిత బంధు వస్తుందనుకున్న సమయంలో కేసీఆర్ ఆగస్టు 15 ప్రసంగంలో పాక్షిక అమలు గురించి చెప్పడంతో రాజకీయవర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. దళిత వర్గాల్లో టెన్షన్ ప్రారంభమయింది. హుజూరాబాద్‌లో కూడా పథకం ప్రారంభం రోజున 15 మందికి మాత్రమే చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఐదు వేల మందిని తొలి విడతగా లబ్దిదారులుగా ఎంపిక చేసినా ఒక్క సారే ఎందుకు పంపిణీ చేయడం లేదన్న సందేహం కూడా అక్కడి దళిత వర్గాల్లో ప్రారంభమయింది.
Also Read: దళిత బంధుపై పుకార్లు నమ్మవద్దు.. అర్హులందరికీ ఇస్తాం.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడి
ఎన్నికలకు ముందే అందరికీ ఇవ్వాలంటున్న విపక్షాలు..!
విపక్ష పార్టీలు దళిత బంధుపై ప్రజల్లో ప్రారంభమైన సందేహాలను పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తాయి. అది రాజకీయం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూస్తే.. హుజూరాబాద్‌లో కూడా పూర్తి స్థాయిలో పథకం అమలు చేయలేరని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఎన్నికలకు ముందే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలన్న సవాళ్లను ఎక్కువగా చేస్తున్నారు. వారంతా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో వరద సాయం విషయాన్ని కేస్ స్టడీగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ వరద బాధితులైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేశారు. కొంత మందికి పంపిణీ చేసిన తర్వాత గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో వరద సాయాన్ని నిలిపివేశారు. పోలింగ్ తర్వాత వరద సాయం పంపిణీ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఎవరికీ పెద్దగా సాయం చేయలేదు. దళిత బంధును కూడా అలాగే ఆశ పెట్టి కొంత మందికి ఇచ్చి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టించుకోరని విపక్ష నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ప్రస్తుతం కేసీఆర్ చేసిన " పాక్షిక అమలు" వ్యాఖ్యలు ఆయుధంలా కనిపిస్తున్నాయి.
కేసీఆర్ "సింహంపై స్వారీ" చేస్తున్నారంటున్న సొంత పార్టీ దళిత నేతలు..!
కడియం శ్రీహరి చెప్పినట్లుగా "దళిత బంధు" పథకం అమలు ఇప్పుడు కేసీఆర్ సింహంపై స్వారీ లాంటిదే. ఆయన పథకాన్ని హుజురాబాద్‌లో సంపూర్ణంగా అమలు చేసి చూపించాల్సి ఉంది. ఆ తర్వాత ఎక్కడా ఆలస్యం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దళితులకూ పథకాన్ని అందించాల్సి ఉంది. లేకపోతే ఆయా వర్గాలు మళ్లీ మోసపోయామనే భావనకు వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే... మొదటికే మోసం వస్తుంది. తెలంగాణలో 18శాతం వరకూ ఉన్న దళిత కుటుంబాలు అందరికీ పథకం వర్తింప చేయడం ఆర్థిక పరంగా అసాధ్యం. ఒక్క హుజురాబాద్‌లో అమలు చేయడానికే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. రూ. లక్ష కోట్లను ఒకటి, రెండేళ్లలో అప్పో, సప్పో చేసి తీసుకొచ్చి పథకం అమలు చేసే పరిస్థితి కూడా లేదు. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అందరికీ అమలు చేసి, మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన ఇతర దళితులు ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉంది.
కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమం నాటి కంటే సంక్లిష్టమైన పరిస్థితి. మధ్యలో తగ్గితే ఊహించని నష్టం ఖాయం..!
అదే సమయంలో... దళితేతర వర్గాల నుంచి "మాకేంటి" అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎన్నింటినో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతీ కుటుంబం ఆశ పడటం సహజం. ఈ ఆశలను కేసీఆర్ తన రాజకీయ తెలివితేటలతో అధిగమించాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించేటప్పుడు .. అందరూ పులిమీద స్వారీ చేస్తున్నారని.. ఆయన దిగిపోతే.. ఆ పులే ఆయనను మింగేస్తుందని విశ్లేషించేవారు. కానీ కేసీఆర్ చాలా పకడ్బందీగా ఉద్యమాన్ని తీరానికి చేర్చారు. ఇప్పుడు దళిత బంధును కూడా కేసీఆర్ ఉద్యమంగానే చెబుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఇతర నేతలు సింహంపై స్వారీగానే విశ్లేషిస్తున్నారు. ఓ రకంగా తెలంగాణ ఉద్యమం కంటే క్లిష్టమైన ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనుకున్నట్లుగా ఈ "పథకం ఉద్యమాన్ని" తీరానికి చేర్చాలి..మధ్యలో ఎక్కడైనా దిగిపోయే ప్రయత్నం చేస్తే... అది ఆయనను అధికారం నుంచి కిందకు తోసేసిన ఆశ్చర్యం లేదు.
Also Read: Karimnagar: హుజూరాబాద్‌లో దళితబంధు చెక్కులు తొలుత 15 మందికే.. ఆ తర్వాత మిగతావారికి.. సీఎస్ వెల్లడి