KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన
తెలంగాణలో దళిత బంధు పథకం ఇవాళే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కేసీఆర్ హుజూరాబాద్ వెళ్లి 15 మందికి దళిత బంధు చెక్కులు ఇవ్వనున్నారు.

Background
తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు. ఇప్పటికే అక్కడ సభా ప్రాంగణం సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేదికపైనుంచే కేసీఆర్ 15 మందికి తొలుత దళిత బంధు చెక్కులను అందజేస్తారు. అందుకోసం ఇప్పటికే ఆ 15 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. సభా ఏర్పాట్లను ఇదివరకే మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటివారు పరిశీలించారు.
ఈసారి వస్తే నాకు చాయ్ పోస్తవా మరి..: కేసీఆర్
కనుకల గిద్ద గ్రామం నుంచి లబ్దిదారులుగా ఎంపికైన కొత్తూరి రాధ-కొత్తూరి మొగిలి అనే కుటుంబానికి సీఎం కేసీఆర్ తొలి దళిత బంధు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని సీఎం కేసీఆర్ అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని మహిళ చెప్పింది. దీంతో ఈసారి నేనొస్తే నాకు చాయ్ పోస్తవా మరి.. అని కేసీఆర్ తమాషాగా మాట్లాడారు. ఆ తర్వాత మొత్తం 15 మందికి కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందజేశారు.
వీళ్లందరి పర్యవేక్షణలోనే దళిత బంధు
‘‘ఈ దళిత బంధు ఆశామాషీ కాదు.. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సమాజంలోని పెద్దలు కూడా పర్యవేక్షణ చేస్తుంటరు. దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు వంటి 23 నుంచి 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారు. వీరు కాక దళిత బంధు కమిటీలు కూడా వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది మొత్తం కలిపి లక్షకు పైగా కమిటీ మెంబర్లు అవుతరు. 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు, ఈ లక్ష పైచిలుకు కమిటీ మెంబర్లు మొత్తం లక్షా 25 వేల మంది కలిసి ఈ పథకాన్ని పర్యవేక్షణ చేస్తారు. వీరి కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటవుతుంది. అంటే కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటయ్. దేశంలో ఇంతటి గొప్ప పథకం తొలిసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్లీ పేదరికంలోకి వచ్చే సమస్య లేనే లేదు.’’ అని కేసీఆర్ చెప్పారు.





















