Telangana News : తెలంగాణ డీజీపీని ఏపీకి పంపే వ్యూహమా ? ఆ కేసును త్వరగా తేల్చాలని హైకోర్టులో కేంద్రం పిటిషన్ !
తెలంగాణ డీజీపీని ఏపీకి పంపాలని బీజేపీ ప్రయత్నిస్తోందా ? హఠాత్తుగా కేంద్రం హైకోర్టులో త్వరగా విచారణ చేయాలని ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది ?
Telangana News : తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారణ చేయాలని కోరింది. అయితే హైకోర్టు జూన్ 5 న విచారిస్తామని తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది IAS , IPS అధికారులను AP, తెలంగాణకు కేటాయించింది కేంద్రం. కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించిన కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులు తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఇప్పటికే హైకోర్టు అదేశాలతో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లారు. సీఎస్ పోస్టులో ఉన్న ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి రావడంతో చివరికి వీఆర్ఎస్ తీసుకున్నారు.
ఏపీ క్యాడర్‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ మొన్నటిదాకా తెలంగాణ సీఎస్ గా పని చేశారు. అయితే క్యాడర్ విషయంలో వారం కిందట హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు. కానీ అక్కడ పోస్టింగ్ కేటాయించలేదు. విధుల్లో చేరకుండానే పదవి విరమణ తీసుకున్నారు.
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు కొన్నాళ్ల కిందట వాయిదా వేసింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు డీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కుట్రలతో తమను కేసుల్లో ఇరిక్సుతన్నారని బండి సంజయ్ ఆరోపించారు. డీజీపీని ఏపీ క్యాడర్ కు పంపిస్తామన్న ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేసులను త్వరగా తేల్చాలని కేంద్రం హైకోర్టును ఆశ్రయించడంతో అధికారవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది. అయితే విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు చెప్పడంతో మరో రెండు నెలల వరకూ ఈ అంశంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు.