Industrial Explosions: పరిశ్రమల్లో సంభవించేవి ఈ ఐదు రకాల పేలుళ్లే... వీటితోనే చాలా ప్రమాదం
పారిశ్రామిక వాడల్లో కార్మికుల భద్రతా డొల్లతనాన్ని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు బయటపెట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

పారిశ్రామిక వాడల్లో కార్మికుల భద్రతా డొల్లతనాన్ని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు బయటపెట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పారిశ్రామిక వాడల్లో సంభవించే పేలుళ్లు ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటాయి. అవేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
రసాయనాల సమ్మేళనం వల్ల ఏర్పడే పేలుళ్లు (Chemical Explosions)
పరిశ్రమల్లో వాడే రియాక్టర్లలో రెండు, లేక అంతకన్నా ఎక్కువ రసాయనాలు కలిసినప్పుడు వాటి ప్రతిస్పందన కొన్నిసార్లు తీవ్రంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో జనించే ఉష్ణం, వాయువుల కారణంగా రియాక్టర్లు పేలుతాయి. రసాయన సమ్మేళనం కారణంగా ఇది జరుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీనే ఉదాహరణగా తీసుకుంటే, రియాక్టర్లలో ఒక క్రమ పద్ధతిన, నిర్దుష్టంగా ఒక ఉష్ణోగ్రత వద్ద రసాయన సమ్మేళనం జరుగుతుంది. ఆ సమయంలో కూలింగ్ సిస్టం వైఫల్యం చెందితే, ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రత, గ్యాస్ విడుదల అవుతుంది. ఈ అధిక పీడనాన్ని తట్టుకోలేక రియాక్టర్ పేలుతుంది. ఈ పేలుడు కారణంగా అక్కడ నిల్వ చేసిన ఇతర రసాయనాలు తోడైతే ఈ ప్రమాదం భారీగా మారుతుంది.
అధిక పీడనం కారణంగా జరిగే భౌతిక పేలుళ్లు (Physical Explosions)
ఇక పరిశ్రమల్లో రసాయన పేలుళ్ల తర్వాత ఎక్కువగా సంభవించే పేలుళ్లు భౌతిక పేలుళ్లు. అంటే రసాయన సంయోగ క్రియ కారణం కాకుండా కేవలం పీడనం ఎక్కువై బాయిలర్లు, ప్రెషర్ వెసెల్స్ పేలడం జరుగుతుంది. ఎక్కువగా పాత బాయిలర్లు ఈ పీడనం తట్టుకోలేక పేలడం జరుగుతుంది. బాయిలర్లలో ఆవిరి పీడనం తట్టుకునే శక్తి ఒక నిర్దుష్టమైన పద్ధతి వరకు ఉంటుంది. అంతకు మించితే బాయిలర్ల లోహ నిర్మాణం దీన్ని తట్టుకోలేక పేలిపోతుంది. ఉదాహరణకు వస్త్ర పరిశ్రమల్లో బాయిలర్లను వాడతారు. ఈ బాయిలర్ సేఫ్టీ వాల్వ్ పని చేయకపోవడం కారణంగా పీడనం అధికమై బాయిలర్ పేలిపోయింది. ఇది కార్మికులకు ప్రాణ నష్టాన్ని, ఆ ఫ్యాక్టరీకి ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది.
మండే వాయువులు, ద్రవాల కారణంగా పేలుళ్లు (Gas - Vapor Explosions)
పరిశ్రమల్లో ఆయా ఉత్పత్తుల కోసం మండే వాయువులు, ద్రవాలను వాడతారు. కొన్నిసార్లు ఈ వాయువు లేదా ద్రవాలు ఆవిరి రూపంలో లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక నిష్పత్తి వద్ద ఇవి కలిసినప్పుడు, ఏదైనా చిన్న నిప్పు రవ్వ రేగినా పేలుడు సంభవిస్తుంది. ఉదాహరణకు పెట్రో కెమికల్ ప్లాంట్స్ లో ఆయిల్ లీక్ అవ్వడం వల్ల అది ఆవిరి రూపంలో గాలిలో కలుస్తుంది. అక్కడ చిన్న స్పార్క్ ఏర్పడినా గాలిలోని ఉన్న ఆ ఆయిల్ రూపంలో ఉన్న ఆవిరి మండి పెద్ద విస్పోటనానికి దారి తీస్తుంది. ఇది ప్లాంట్‌తో పాటు, చుట్టుపక్కల ప్రాంతంలోని నివాస సముదాయలకు ప్రమాదకరంగా భారీ విధ్వంసానికి కారణం అవుతుంది. ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది.
దుమ్ము కణాలతోనూ పేలుళ్లు (Dust Explosions)
కొన్ని పదార్థాలు గాలిలో అతి సూక్ష్మ కణాలుగా కలిసిపోతాయి. ధాన్యం పిండి, బొగ్గు దుమ్ము, కలప దుమ్ము, పొట్టు వంటివి. ఇవి కూడా గాలిలో ఒక నిర్దుష్టమైన సాంద్రతలో ఉన్నప్పుడు వాటికి నిప్పురవ్వ తగిలినా పేలుడు సంభవిస్తుంది. ఉదాహరణకు ధాన్యం మిల్లును తీసుకుంటే, గోధుమ పిండి ప్రాసెసింగ్ చేసేటప్పుడు దుమ్ము పెద్ద ఎత్తున గాలిలో కలుస్తుంది. ఇలా గాలిలో తేలే ఈ దుమ్ము, చిన్న నిప్పు రవ్వ కారణంగా మంటలు చెలరేగుతాయి. ఆ తర్వాత ఆ మంట ద్వారా మరో పేలుడు జరుగుతుంది. ఇది ఆ మిల్లుకు లేదా, ప్రాణ నష్టానికి దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో జరుగుతుంటాయి.
మండే ద్రవాల ట్యాంకర్లు పేలడం (BLEVE - Boiling Liquid Expanding Vapor Explosion)
అధిక పీడనం వద్ద నిల్వ చేసే మండే కొన్ని రకాల ద్రవాలు పేలుళ్లకు కారణం అవుతాయి. ఇలాంటి వాటిని బ్లేవ్ (Boiling Liquid Expanding Vapor Explosion) అని అంటారు. అధిక పీడనం వద్ద నిల్వ చేసే మండే ద్రవాలు కొన్నిసార్లు ఆ ట్యాంకు గోడలు బలహీనంగా ఉంటే వేడెక్కి పగిలిపోతాయి. ఈ సందర్భంలో లోపల ఉండే ఆ మండే ద్రవపదార్థం ఆవిరిగా మారుతుంది. ఈ క్రమంలో భారీ పేలుడు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు కొన్ని రసాయన కర్మాగారాలలో ప్రొపేన్, ఎల్పీజీని వాడతారు. ఇవి నిల్వ చేసే ట్యాంకర్‌కు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగితే, ఆ కారణంగా ఆ ట్యాంకర్ గోడలు వేడెక్కే అవకాశం ఉంది. దీని వల్ల లోపల ఉన్న ప్రొపేన్ వేడెక్కి అధిక పీడనం కారణంగా ఆ ట్యాంకర్ పేలిపోయి భారీ విస్పోటనానికి కారణంగా మారవచ్చు. ఈ ట్యాంకర్ పేలుడు, మంటలు, ఆ శకలాల వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. సమీపంలో ఉండే నిర్మాణాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు పారిశ్రామిక వాడలు, వాటి సమీప ప్రాంతాల్లో జరిగిన దాఖలాలు ఉన్నాయి.
ఈ ఐదు రకాల పేలుళ్లపై అవగాహన పెంచుకోవడం ద్వారా పారిశ్రామిక వాడల్లో భద్రతా ప్రమాణాలు పెంచుకునే అవకాశం ఉంది. శాస్త్రీయమైన భద్రతా చర్యలను తీసుకుని అందుకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా అమలు చేస్తే మైలారం పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.






















