Allu Arjun: జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ - జైలు వెనుక గేట్ నుంచి బన్నీని పంపిన పోలీసులు
Hyderabad News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం రాత్రే ఆయన విడుదల కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో జాప్యం జరిగింది.
Allu Arjun Released From Chanchalguda Jail: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైలు వెనుక గేట్ నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన తన నివాసానికి చేరుకున్నారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ విడుదలయ్యారు. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. కాగా, శనివారం ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని ప్రచారం సాగడంతో.. ఫ్యాన్స్‌తో పాటుగా మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో గందరగోళం ఏర్పడగా.. ఆయన్ను 06:05 గంటలకు వెనుక గేట్ నుంచి పంపించారు.
'ఆలస్యంపై లీగల్‌గా పోరాడుతాం'
బన్నీ రిలీజ్ ఆలస్యంపై లీగల్‌గా పోరాడతామని ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి అన్నారు. జైలు అధికారులు ఆయన విడుదలను ఆలస్యం చేశారని.. హైకోర్టు ఆదేశాల్లో వెంటనే విడుదల చేయాలని ఉన్నా అవి అమలు కాలేదని చెప్పారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
నేలపైనే నిద్ర..
అల్లు అర్జున్ శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో జాప్యం జరిగింది. రాత్రి 10:30 వరకూ ఆయన రిసెప్షన్‌లోనే ఉండగా.. అనంతరం ఖైదీలందరూ బ్యారక్‌కు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్ క్లాస్ - 1 రూంలో ఉంచారు. జైలు అధికారులు ఫుడ్ ఇచ్చినా బన్నీ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీదే పడుకున్నట్లు సమాచారం. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. ఈ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. అయితే, బన్నీ రాత్రి విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. అల్లు అరవింద్ తీవ్ర అసహనంతో సొంత కారు వదిలి క్యాబ్‌లో వెళ్లిపోయారు.
క్షణ క్షణం ఉత్కంఠ.. జరిగింది ఇదే..
అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి విడుదల వరకూ క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బన్నీ అరెస్ట్ అయ్యారన్న విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు సహా ప్రముఖులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. సినీ హీరోలు సహా రాజకీయ ప్రముఖులు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. అయితే, చట్టం తన పని చేసుకుపోతుందని.. ఫిలిం స్టారా.? పొలిటికల్ స్టారా.? అనేది చూడమని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.