YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
గత ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. వారితో షర్మిల వాగ్వానికి దిగారు. ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల ఎస్సైపై చేయి చేసుకున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు అందాయి. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. వారితో షర్మిల వాగ్వానికి దిగారు. ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల ఎస్సైపై చేయి చేసుకున్నారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులపై ఆమె చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇది విపరీతంగా చర్చనీయాంశం అయింది. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. విచారణ చేసి నేడు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని వైఎస్ షర్మిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.