YS Sharmila: వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల స్పందన ఇదీ - ఇక ఖాయమే! ఆమె వెంటే కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
శుక్రవారం రాత్రి షర్మిల ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె బయటకు రాగానే వెంట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలపడం ఖాయం అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చేసిన చర్చలు కూడా ఫలవంతంగానే జరిగినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయంపై వైఎస్ షర్మిల స్పందించిన తీరు అత్యంత సానుకూలంగా ఉంది. శుక్రవారం రాత్రి (ఆగస్టు 11) వైఎస్ షర్మిల ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె బయటకు రాగానే షర్మిల వెంట కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇద్దరూ కలిసి బయటకు రావడంలో అక్కడే ఉన్న విలేకరులు షర్మిలను చుట్టుముట్టి విలీనం గురించి ప్రశ్నించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసే అంశంపై రిపోర్టర్లు షర్మిలను ప్రశ్నించగా, ఆమె సానుకూలంగా నవ్వారు. ఏమీ మాట్లాడలేదు. పక్కనే ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలగజేసుకొని షర్మిల ఢిల్లీ నుంచి వస్తుండగా, ఫ్లైట్ లో తాము ఇద్దరం కలిశామని అన్నారు. ఫ్లైట్ లో రాజకీయాలు ఏమీ మాట్లాడుకోలేదని అన్నారు. అయితే, షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కోమటిరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కోమటిరెడ్డి చెబుతున్నారని దీనిపై మీ స్పందనేంటని షర్మిలను విలేకరులు అడిగినా ఆమె నవ్వి ఊరుకున్నారు. ఇంకా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఆమె తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తిగా భావిస్తున్నామని అన్నారు. షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో పనిచేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. కాంగ్రెస్ లో తండ్రికి ఉన్న మర్యాదే కూతురు షర్మిలకూ ఉంటుందని అన్నారు.
వైఎస్ షర్మిల తన పార్టీని విలీనం చేయడం ఖాయంగా కనిపిస్తున్న వేళ ఈ వార్తలపై ఆమె స్వయంగా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
YS Sharmila is going to New Delhi to meet Congress leadership, Congress MP Venkat Reddy is also present! She going to merged party into Congress Party 🔥🔥🔥🔥💪💪 pic.twitter.com/ylRB7MCWKZ
— Ashish Singh (@AshishSinghKiJi) August 11, 2023
విలీనానికి మధ్యవర్తిగా కర్ణాటక పీసీసీ చీఫ్
ఈ విలీనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు మధ్య రాయబారిగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇటీవల షర్మిల శివకుమార్ తో కూడా భేటీ అయ్యారు. ఇటీవలే బెంగుళూరు వెళ్లిన షర్మిల అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. పార్టీ విలీనంపై వీరిద్దరితో తొలి దశ చర్చలు నిర్వహించారు.
విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.