KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
HCU Lands Auction Issue | కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం వేయడం సరికాదని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేయడం దారుణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU)కి చెందిన 400 ఎకరాలను వేలం వేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా HCU భూముల వేలం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం మొదట అమాయక ప్రజల ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు పర్యావరణాన్ని నాశనం చేస్తూ మూగ జీవాల ఆవాసాలను సైతం తెలంగాణ ప్రభుత్వం నాశనం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తున్నారు.
కేటీఆర్ పోస్టులో ఏముందంటే..
కాంగ్రెస్ ప్రభుత్వం మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. తరువాత, అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాల ప్రజలను సైతం వెంబడించారు. బంజరు భూముల్లో బల్లులు కూడా గుడ్లు పెట్టవు అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు. వాటి నివాసమైన అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి మూగ జీవాలకు ఆవాసాలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేయడాన్ని ఇంకా మీరు సమర్థించుకుంటున్నారా. ఇది అభివృద్ధా? అది నిజంగానే ప్రభుత్వ భూమా?. మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా?. మీరు ఎన్నికైన ప్రతినిధినా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటా’ అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో పోస్ట్ చేశారు.
First - you bulldozed the homes of many poor people in the name of environmental protection!
— KTR (@KTRBRS) April 1, 2025
Next, you went after the tribal hamlets in the name of development. Barren lands and even lizards won’t lay eggs, you had said
Now you come after homes of animals and commit mass… pic.twitter.com/Us5Av7ta2Y
విధ్వంసం మీ ఏకైక నినాదం!
రాష్ట్ర ప్రభుత్వం ఏకైక నినాదం విధ్వంసమే. రాష్ట్ర ఖజానాను నాశనం చేయడమే మీ ఏకైక నినాదం. మీ బుల్డోజర్లు రాత్రిపూట, వారాంతాల్లో సైతం ఎందుకు ఎందుకు నిరంతరాయంగా పనిచేశాయి? అదే సమయంలో కోర్టులకు మీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. బయోడైవర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అటవీ భూములను వేలం వేసి, అటు పర్యావరణాన్ని నాశనం చేసి మూగ జీవాలకు ఆవాసం లేకుండా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివిన వారు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు గొప్ప పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. యూనివర్సిటీ విద్యార్థుల పైన, యూనివర్సిటీ భూముల పైన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నది. వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను నరికి, జంతువులను, చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు.
పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హెచ్‌సీయూ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే. పశ్చిమ హైదరాబాదులో భవిష్యత్తులో ఢిల్లీలాగ ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ఒక ఎన్విరాన్మంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా 400 ఎకరాలు ఎలా అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారు. పర్యావరణ నష్టం ప్రభావం పైన అధ్యయనం చేయాలని ప్రజలు, విద్యార్థులు అడుగుతున్నారు
అమ్మడం, అప్పులు తేవడమే రేవంత్ అజెండా..
21 సంవత్సరాల తర్వాత ఇటీవల ఈ కేసు తేలింది. కానీ ప్రభుత్వంఆ భూములను అమ్మి రూ. 30 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తుంది. ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండా పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలు, ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. వేల ఎకరాలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు 45 వేల ఎకరాలు అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు.






















