Khammam Meeting: మీరు బస్సులు ఇవ్వకపోతే, నడుచుకుంటూ ఖమ్మం సభకు - అడ్డు వస్తే తొక్కుకుంటూనే! రేవంత్ రెడ్డి
Revanth Reddy: శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో... కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తే బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.
TPCC Chief Revanth Reddy: ఖమ్మం సభతో బీఆర్ఎస్ పాలనకు సమాధి కడతామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో... కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తే బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆరెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు రేవంత్ . జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందన్నారు.
ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోందని, బీఆర్ఎస్ ఎన్ని అడ్డుగోడలు సృష్టించినా, కాంగ్రెస్ కార్యకర్తలు వాటినిపడగొట్టి ఖమ్మం సభకు హాజరవుతారని అన్నారు. పార్టీలో పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపిస్తే...రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మాది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇస్తామన్నారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం” అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గత నాలుగైదు నెలలుగా చర్చలు జరిపామని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు రేవంత్. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. సభ ఏర్పాట్లు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయన్నారు.
టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా మీ నాయిన కేసీఆర్ టీడీపీని వీడింది అని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. “నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సాయంగా ఉండేందుకు 1500 బస్సులు సభ కోసం తీసుకోవాలనుకున్నారు. మా సభకు డబ్బులు కట్టి బస్సులు అడిగితే ఇవ్వట్లేదు. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా... ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు. మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు. సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.. బీఆరెస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క కట్టుకో” అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఇంటెలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి కేసీఆర్ కు పెట్టాలని చెప్పారు. జూలై 2న ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుందన్నారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు. భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి వేల కిలోమీటర్లు నడిచారని అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సచివాలయానికి రాని కేసీఆర్ ను ప్రజల బాట పట్టించామన్నారు. ఎలక్షన్ శాంపిల్ కోసమే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తుండు...అసలు ఈ ప్రభుత్వమే శాంపిల్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ గవర్నమెంటే శాంపిల్ గవర్నమెంట్ అని.. కేసీఆర్ ది ఆరంభ శూరత్వమన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటదన్నారు రేవంత్. అధికారంలోకి రాగానే నూటికి నూరుశాతం ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని.. తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని.. ఈస్ట్‌మన్ కలర్‌లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను పాదయాత్ర ద్వారా భట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందన్నారు. భట్టితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘సభ ఏర్పాట్లపై భట్టి సలహాలు, సూచనలు తీసుకున్నాం. జులై 2న జరిగే సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సభకు హాజరవుతారు. జనగర్జన సభకు జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందనను అందరూ చూస్తారని బిఆర్ ఎస్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial