Vikarabad Weather Report: వికారాబాద్ జిల్లాలో హైఅలర్ట్- అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారుల సూచన
Vikarabad Weather Report: వికారాబాద్ జిల్లాలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

Vikarabad Weather Report: వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దారూరు మండలం గురుదొట్ల గ్రామంలో చెరువుకు గండి పడటంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే గండి పడిందని దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టు, మోమిన్పేట్ నంది వాగు చెరువు, సర్పంచ్ పల్లి చెరువు, మరియు శివారెడ్డి పెట్ చెరువు నిండుకుండలు తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అన్ని శాఖల అధికారులు సమన్వయపరుస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ పతిక్ జైన్‌తో జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పరిస్థితులను సమీక్షించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. అనంతగిరి పర్యాటకులు, ట్రెక్కింగ్ ప్రేమికులు ఈ సమయంలో రావద్దని వచ్చినా అనుమతులు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. 
మరోవైపు వికారాబాద్‌లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.దీంతో జనం భయపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. రెండు నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిరెడ్డి పల్లి, న్యామత్ నగర్ లలో ఇళ్ల నుంచి జనాలు బయటకు వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల 47 నిమిషాలకు భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు... ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించారు.





















