Vijayashanti: హిందువులకు ఊరట కలిగించే తీర్పు అది, ఆయన వాదన అర్ధరహితం - విజయశాంతి
దేశంలోని అందరు హిందువులకు వారణాసి కోర్టు తీర్పు ఊరట కలిగించే అంశమని విజయశాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం (సెప్టెంబరు 13) ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. దానిపై ఓ పోస్టు పెట్టారు.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఉన్న హిందూ దేవతలకు హిందువులు రోజువారీగా పూజలు నిర్వహించుకునేలా వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలివ్వడం సంతోషం అని విజయశాంతి అన్నారు. దేశంలోని అందరు హిందువులకు ఇది ఊరట కలిగించే అంశమని అన్నారు. ఈ మేరకు విజయశాంతి మంగళవారం (సెప్టెంబరు 13) ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. దానిపై ఓ పోస్టు పెట్టారు.
‘‘వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరీ, వినాయకుడు, ఇతర దేవీ దేవతల విగ్రహాలకు హిందువులు రోజువారీగా పూజలు నిర్వహించుకునేలా ఆదేశించాలన్న హిందూ మహిళల పిటిషన్‌పై విచారణను కొనసాగించేందుకు జిల్లా కోర్టు సమ్మతించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. దేశంలోని కోట్లాది హిందువులకు సంతోషం కలిగించే నిర్ణయమిది. అయితే ప్రాచీన ఆలయాలను హిందువులు మళ్లీ పునరుద్ధరించుకునే వీలు లేకుండా కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గారు ఇప్పుడు ప్రస్తావించడం అర్థరహితం.
ఈ చట్టం ఉద్దేశాన్ని వారణాసి కోర్టు నిర్ణయం నీరు గారుస్తుందంటూ హైకోర్టులో అప్పీలు చేయాలనడం ఆయనకి ఎంత మాత్రం తగదు. ఎందుకంటే, హిందువుల పిటిషన్‌పై విచారణ కొనసాగింపు వల్ల ముస్లింలకు వచ్చే నష్టం ఏమీలేదు. ఇక్కడ హిందువులు కోరుతోంది కేవలం నిత్య పూజలకి అవకాశం ఇమ్మని మాత్రమే. ఆ పిటిషన్ జ్ఞానవాపిలో ముస్లింల ప్రార్థనలను అభ్యంతర పెట్టడం లేదు. అందువల్ల ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి సమస్యా లేదు. హిందువులు అక్కడ పూజ చేసుకోవడానికి అవకాశం లభిస్తే ఈ పరిణామం ప్రత్యేకంగా ఎంఐఎం వంటి మతశక్తులకు తప్ప, ఇంకెవ్వరికీ సహజంగానైతే వ్యతిరేకమైనది కానందువల్ల, సామరస్య వాతావరణాన్ని కోరుకునేవారు ఎవరైనా వారణాసి కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టరు.’’ అని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
తీర్పు ఏంటంటే..
ఉత్తర్‌ప్రదేశ్ జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తీర్పు అనంతరం కోర్టు బయట కోలాహలం నెలకొంది. హిందువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేశారు.
భారీ భద్రత
అత్యంత సున్నితమైన కేసు కావడంతో వారణాసిలో 144 సెక్షన్ విధించారు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు.
ఇదీ కేసు
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు ఇచ్చారు.
సర్వేలో
దీంతో జ్ఞానవాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది.