VH Comments: నేనేం తప్పు చేశా, నన్నెందుకు పక్కన పెట్టారు - ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరతా: వీహెచ్
Telanagna Congress: ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని వీహెచ్ అన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని వీహెచ్ అన్నారు.
V Hanmantha Rao Comments: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను ఎంపీ అభ్యర్థిగా కచ్చితంగా బరిలో నిలుస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు అన్నారు. తాను ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని అన్నారు. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని అన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని వీహెచ్ అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు.
పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇండియాలో తన కంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. పార్టీలో నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి? గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది.
మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదు. ఏం ఉద్దరించారని బీజేపీ నేతలు సంకల్ప యాత్ర చేస్తున్నారు. రాముడ్ని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రధాని మణిపూర్ వెళ్ళాలి. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు మీ అయ్య జాగీర్లా?’’ అని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.