Uttam Kumar Reddy: అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా - తేల్చిచెప్పిన ఉత్తమ్
బుధవారం (ఆగస్టు 30) ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కి కలిసి వస్తుందని అన్నారు. తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నాని, కోదాడ నుంచి తన భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనీ అధిష్ఠానాన్ని కోరుతున్నానని, ఏఐసీసీ రూల్స్ మేరకు ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్ల కేటాయింపు ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం (ఆగస్టు 30) ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హుజూర్ నగర్, కోదాడలో 50 వేల మెజారిటీకి ఏమాత్రం తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ తేల్చి చెప్పారు. పార్టీ పోటీ చేయొద్దంటే చేయనని అన్నారు.
కర్ణాటకలో తాము ఇచ్చిన ఐదు హామీల్లో నాలుగు హామీలను కర్ణాటక ప్రభుత్వం అమలు పర్చిందని గుర్తు చేశారు. అక్కడ వచ్చే నెల నుండి యువనిధి స్కీమ్ అమలు చేస్తారని చెప్పారు. అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా తాము గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశామని వివరించారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటి కోసం 3 లక్షలు అన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆఖరికి కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయలేదని అన్నారు. ముస్లింలకి 12 శాతం రిజర్వేషన్ల అంశం ఏం చేశారని ప్రశ్నించారు. దళిత గిరిజనలకు 3 ఎకరాలు ఇస్తామన్న హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. పంటల కోసం ఉచిత ఎరువులు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడానికి కేటాయించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఏనాడూ తప్పలేదని.. దానికి కర్ణాటక ప్రభుత్వమే సాక్ష్యమని అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామనే నమ్మక ఉందని ఉత్తమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అహంకారం అనేది బీఆర్ఎస్‌కు పెద్ద శత్రువు అని అదే వారిని గద్దె దించబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనా స్పందన
అవసరం అయితే నల్గొండ సీటు వదులుకుంటా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి తన ప్రియ మిత్రుడు అని.. నల్గొండలో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని చెప్పారు. నిన్న పీఈసీ సమావేశంలో రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని అన్నారు. ఏదో గొడవ జరిగిందని అందరూ ప్రచారం తప్పుగా చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.