Union Minister Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి: నాలా ఘటనపై కిషన్ రెడ్డి ఫైర్
Union Minister Kishan Reddy: పాల కోసం వెళ్లి నాలాలో పడి చనిపోయిన మౌనిక మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Union Minister Kishan Reddy: సికింద్రాబాద్ కళాసిగూడలో పాల కోసం వెళ్లి నాలాలో పడి చనిపోయిన బాలిక మౌనిక మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిన్నారి మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. కాంట్రాక్టర్లకు జీహెచ్ంసీ అధికారులు సరిగ్గా బిల్లులు ఇవ్వకపోవడం వల్లే వారు సరిగ్గా పనులు చేయలేదని.. దీంతో మౌనిక మృతి చెందిందని చెప్పారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు. రోడ్లు తవ్వినప్పుడు కనీస దజాగ్రత్తలు పాటించడం లేదని.. శాఖల మధ్య కూడా ఎలాంటి సమన్వయం లేదని విమర్శలు గుప్పించారు.
సికింద్రాబాద్లోని కళాసిగూడలో మ్యాన్-హోల్లో పడి 4వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విచారకరం, దురదృష్టకరం.
— G Kishan Reddy (@kishanreddybjp) April 29, 2023
4 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ అధికారుల్లో, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.
బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
Live: Visit to residence of girl child who died after falling into the drain at Kalasiguda, Secunderabad. https://t.co/h9OHB4YccL
— G Kishan Reddy (@kishanreddybjp) April 29, 2023
మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ... "హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు, లోపుల మురుగు. బయటకు వెళ్లిన వారు ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి" అని తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
రాష్ట్రంలో గత కొద్ది రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నాశనం అవుతుండగా.. మరోవైపు హైదరాబాద్ లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సికింద్రాబాద్ కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పదకొండేళ్ల చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బాలిక మృతికి కారణం అయిన ఇద్దరు జీహెచ్ఎంసీ అధికారులపై వేటు వేశారు. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ బీఎం హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరా బాయికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.