G Kishan Reddy: రెండేళ్లలో ఎయిర్ పోర్టులా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - కిషన్ రెడ్డి
Secunderabad Railway Station: రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం రీ డెవలప్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
Kishan Reddy Visits Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం (ఫిబ్రవరి 7) పరిశీలించారు. కొనసాగుతున్న నిర్మాణ పనులను రైల్వే జీఎం, ఇతర ఉన్నతాధికారులను అడిగి కేంద్రమంత్రి వివరాలు తెలుసుకున్నారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం రీ డెవలప్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం మూడు దశల్లో పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్లాట్ ఫామ్ 1 సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు.
ప్లాట్ ఫామ్ 10లో కూడా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్నట్లు చెప్పారు. మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫామ్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శరవేగంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
‘‘చాలా తక్కువ సమయంలో వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నారు. రూ.700 కోట్లకు పైగా ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2025 నవంబర్ కల్లా ఇది పూర్తి అవుతుంది. మరోవైపు, చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అది కూడా త్వరలోనే పూర్తి అవుతుంది.
చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు నేరుగా స్టేషన్ లోకి రావడానికి.. బయటికి వెళ్ళడానికి గగనతలం నుండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది’’ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వివరించారు.