Telangana రాష్ట్రానికి కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటవా? సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
Telgana News: కేంద్రంలో అధికారంలో ఉన్నా, గోదావరి కృష్ణా బోర్డులను తాము ప్రభావితం చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానీ కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చుని పోరాటం చేస్తానన్నారని ఆయన సెటైర్ వేశారు.
Kishan Reddy Fires on Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారు.. రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని... కాంగ్రెస్ ‘రిజర్వేషన్’ ప్రచారం ఫెయిల్ అయింది అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందని, కమలం గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెబుతున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డివి బాధ్యతారాహిత్యమైన విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి బాధ్యతారాహిత్యమైన విమర్శలంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్లు వెచ్చిస్తే.. గాడిద గుడ్డు అనడం మూర్ఖత్వమన్నారు. వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ.. రిజర్వేషన్ లు తొలగించరనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ప్రజల మద్దతు చూస్తే బీజేపీ అత్యధిక స్థానాలు గెలువబోతోంది. దీనిపై ఎటువంటి అనుమానాలూ లేవన్నారు. బీజేపీ పట్ల విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి పదేండ్లు అవకాశం ఇచ్చారు. అంతకుముందు పదేండ్లు కాంగ్రెస్ కు పీఠాన్నిచ్చారు. అదేవిధంగా ఈసారి మెజారిటీ ఓట్లు, సీట్లు బీజేపీకే వేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఈ అసహనం కనబడుతోందని ఎద్దేవా చేశారు.
రేవంత్ అహంకారానికి నిదర్శనం
‘సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులను జైళ్లో వేస్తే బుద్ధి వస్తుందన్న ప్రకటనలే అందుకు నిదర్శనం. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతల్లో చూపించాలన్న ఆలోచన లేదు. టాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియని వ్యక్తి రేవంత్. రీసెర్చ్ టీమ్ పెట్టుకుని.. ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్ చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒకటే. రెండు పార్టీలు దొందు దొందేనని ప్రజలకు అర్థమైంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదిస్తారని’ నమ్మకం ఉందన్నారు కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ లో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయింది. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు అబద్ధాల ప్రచారంలో పోటీపడుతున్నాయి. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని మోదీ చెప్పినా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి యూరియా పరిశ్రమ తీసుకొస్తే, అది గాడిద గుడ్డు లా కనబడుతున్నదా? గెలవలేని సీట్లకు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఎన్నికలు వస్తాయని తెలిసినా రైతుభరోసా ఎందుకివ్వలేదు.
భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక. కానీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడా జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోదీ పైన ‘నీచ్’ (తక్కువజాతి) అని మాట్లాడారు. అది వారి దురహంకారానికి నిదర్శనం. ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ దురంహాకార వైఖరికి ఇది. కరీంనగర్, వరంగల్ సభలో మోదీ సభ విజయవంతమైంది. ప్రజలు ఎండల్ని లెక్కచేయకుండా బీజేపీ సభలకు వస్తున్నారు. మే 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నట్లు’ కిషన్ రెడ్డి వెల్లడించారు.