TSRTC MD Sajjanar: డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ జి. రాజయ్య ఆత్మహత్యపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
![TSRTC MD Sajjanar: డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన TSRTC MD Sajjanar gives clarity on RTC driver Rajaiah who died by suicide TSRTC MD Sajjanar: డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ, అదంతా దుష్ప్రచారమేనని ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/5227c454bf59e4e66c8a3cab5363e0d01669543939563233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ జి. రాజయ్య ఆత్మహత్యపై దుష్ప్రచారం జరుగుతుందన్నారు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. డ్యూటీ మార్పు చేయకపోవడమే డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యకు కారణమన్న వార్తలు పూర్తి అవాస్తవం అన్న ఆయన, ఈ నిరాధారమైన వార్తలను ఖండించారు. రాజయ్య అభ్యర్థన మేరకే జేబీఎస్ కు ఆయనను బదిలీ చేశామని, జేబీఎస్ డ్యూటీని మార్పు చేయమని అధికారులను ఆయన ఎప్పుడూ అడగలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవం అంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘ డ్రైవర్ రాజయ్య అభ్యర్థన మేరకే మూడు నెలల కిందట జేబీఎస్ కు బదిలీ చేశాం. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని, కుటుంబం అక్కడే ఉంటోందని, ఆయన కోరడంతోనే రాజయ్యను జేబీఎస్ కు బదిలీ చేశాం. జేబీఎస్ డ్యూటీని మార్పు చేయాలని ఆయన ఎప్పుడూ అధికారులను అడగలేదు.
రాజయ్య కూతురు గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి డిసెంబర్ 6న ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉంది. ఆలయ సందర్శనలకు ఒక వారం సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేశాం. రాజయ్య చివరగా నవంబర్ 23న డ్యూటీ చేశారు. గోదావరిఖనిలోని తన స్వగృహంలో వ్యక్తిగత కారణాలతోనే రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య విషయం తెలియగానే గోదావరిఖని డిపో మేనేజర్, మృతుడు రాజయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారని తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం టీఎస్ ఆర్టీసీ తరుపున రూ.20 వేలను కుటుంబసభ్యులకు అందజేశారు. డ్యూటీ మార్పు కోసం గోదావరి ఖని డిపోలో రాజయ్య ఎవరినీ సంప్రదించలేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు తెలియజేయాలని పోలీసులను కోరుతున్నాం. డ్యూటీ మార్పు చేయలేదని ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. అందులో వాస్తవం లేదని’ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ జి. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు చేయకపోవడమే కారణమని వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం, ఈ నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నాం. రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే JBS కు బదిలీ చేశాం. జేబీఎస్ డ్యూటీని మార్పు చేయమని అధికారులను ఆయన ఎప్పుడూ అడగలేదు. pic.twitter.com/uLyncnSZud
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) November 27, 2022
అసలేం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీఎస్ ఆర్‌టీసీ డ్రైవర్ రాజయ్య శుక్రవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజయ్య వయసు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. తనను వేరే ప్రాంతానికి బదిలీ చేయడం, డ్యూటీ మార్పు చేయకపోవడంతో మనస్తాపం చెంది డ్రైవర్ రాజయ్య ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లి ప్రగతినగర్ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం బస్టాండ్ కాలనీలోని తన ఇంట్లో రాజయ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇలా ప్రచారం జరిగింది..
గోదావరిఖని డిపోలో డ్రైవర్‌గా చేస్తున్న రాజయ్య కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లోని జేబీఎస్ డిపోకు ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాడు. ఈ క్రమంలో నవంబర్ 23న గోదావరిఖని డిపో అధికారులను ఆశ్రయించి తనను తిరిగి బదిలీ చేయాలని అభ్యర్థించినట్లు ప్రచారం జరిగింది. మరికొంతకాలం జేబీఎస్ లోనే సేవలు అందించాల్సి వస్తుందని అధికారులు సూచించారు. శుక్రవారం రాత్రి డ్రైవర్ రాజయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తనకు డ్యూటీ మార్పు చేయడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అన్నారు. భర్త ఆత్మహత్యపై రాజయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)