Gamyam App: బస్ ట్రాకింగ్ యాప్ లాంచ్ చేసిన టీఎస్ఆర్టీసీ, డయల్ 100, 108కూ అనుసంధానం
Gamyam App: టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ 'గమ్యం'ను లాంచ్ చేసింది. డయల్ 100, 108తోనూ అనుసంధానించింది.
Gamyam App: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్ 'గమ్యం' యాప్ ను తీసుకువచ్చింది. ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు అత్యాధునిక ఫీచర్లతో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ యాప్ ను హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లోని పుష్పక్, మెట్రో సర్వీస్ లకు కూడా ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు సజ్జనార్ వెల్లడించారు. అదే విధంగా జిల్లాలో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. ఈ యాప్ లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం కూడా పలు అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డయల్ 100, 108కు కూడా ఈ యాప్ ను అనుసంధానం చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.
సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు #TSRTC మరో ముందుడుగు వేసింది. అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్ నకు ‘గమ్యం’ గా నామకరణం చేసింది. #Hyderabad లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను… pic.twitter.com/kIqr7AsA1l
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 12, 2023
'ఆ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు'
అలాగే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై సీఎం కేసీఆర్ కు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ సిబ్బందికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించిందని అన్నారు. ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సంస్కరణలను సంస్థ తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. రూ. 200 కోట్లతో బస్టాండ్ లను అభివృద్ధి చేస్తున్నామని, సిబ్బంది ఆరోగ్యాన్ని చూసుకునేందకు ప్రతి డిపోలో ఒక హెల్త్ వాలంటీర్ ఉన్నట్లు తెలిపారు. ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంతో ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బస్సులు ట్రాక్ చేసేందుకు ఇప్పుడు గమ్యం యాప్ తో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. మ్యాప్ మై ఇండియా సహకారంతో యాప్ ను నేడు విజయవంతంగా లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ గమ్యం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవలు పొందాలని ఎండీ సజ్జనార్ సూచించారు.
మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఎ బస్’ ఫీచర్
మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న టీఎస్ఆర్టీసీ.. వారి సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేయడం జరిగింది. ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకోండిలా!
'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్ ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్ స్టాల్ చేసుకుంటే అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ తీసుకు వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి, ప్రోత్సహించారు. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ ను అలానే ఆదరించాలని సంస్థ కోరుతోంది. ఈ యాప్ పై ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది.