TSPSC Paper Leak Case: పేపర్ లీక్ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటికి, ఆశ చూపి గమ్మునుండేలా చేసి!
పేపర్ల లీకేజీకి సంబంధించి మరో ముగ్గురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. వీరిలోనే షమీమ్, రమేష్ మరో వ్యక్తి సురేష్ కూడా ఉన్నారు.
తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ (టీఎస్పీఎస్సీ) పరీక్షా పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులకు పాల్పడ్డ విషయం బయటికి వచ్చింది. వీరిద్దరూ గ్రూప్ - 1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని టీఎస్పీఎస్సీలోనే పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్‌లు గుర్తించారు. అయితే, ఉన్నతాధికారులకు చెప్తారేమో అనే భయంతో షమీమ్, రమేష్‌లను ప్రవీణ్, రాజశేఖర్‌లు ప్రలోభ పెట్టారు. గ్రూప్ 1 పేపర్ మీకు కూడా ఇస్తామని, మీరు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసి మంచి ఉద్యోగం సాధించవచ్చని ఆశ పెట్టారు. ఆ ప్రకారమే షమీమ్, రమేష్‌లకు కూడా గ్రూప్ - 1 పేపర్‌ను పంపించారు.
పేపర్ల లీకేజీకి సంబంధించి మరో ముగ్గురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. వీరిలోనే షమీమ్, రమేష్ మరో వ్యక్తి సురేష్ కూడా ఉన్నారు. వీరిలో సురేష్ తప్ప మిగతా ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే. ఈ షమీమ్, రమేష్ నుంచి న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. వీళ్ళు ఇంకా ఎంతమందికి లీక్ చేశారనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గ్రూప్ - 1 పరీక్ష రాసి, క్వాలిఫై కాని టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.