TS New Secretariat: కొత్త సచివాలయంలో సాగుతున్న పూజలు, మధ్యాహ్నం ప్రారంభం - తొలి సంతకం ఏ ఫైల్‌పైనంటే..
TS New Secretariat: తెలంగాణ నూతన సచివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకోనున్నారు.
TS New Secretariat: హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత నేరుగా 6వ అంతస్థులోని తన చాంబర్ కు సీఎం వెళ్తారు. అక్కడే తన చాంబర్ లో కూర్చొని గృహలక్ష్మీ సహా కీలక ఫైల్స్ పై సంతకాలు చేస్తారు.
మధ్యాహ్నం 1.58 నుండి 2.04 లోపు ఎవరి ఛాంబర్ లోకి ఆ మంత్రులు వెళ్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఫైల్ పై కేటీఆర్ తొలి సంతకం చేస్తారు. అనంతరం అంటే 2.15 గంటలకు సచివాలయం నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. మొత్తం 650 మంది పోలీసులతో సచివాలయానికి భారీ భద్రత చేపట్టనున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం కారణంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద వాహనాలను దారి మళ్లించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వాహనాలకు నో ఎంట్రీ విధించారు. ట్యాంక్ బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాలకు అనుమతి నిరాకరించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులను మూసివేశారు.
నూతన సచివాలయం ఎందుకు కట్టాలనుకున్నారు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.