Hyderabad News: జీహెచ్ఎంసీలో మద్యం షాపులు కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలు- రోనాల్డ్ రాస్ ఆదేశాలు
GHMC Commissioner Ronald Rose: ప్రలోభాలకు గురి కాకుండా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
Transparency in Loksabha Elections 2024: హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections 2024) ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఎన్నికల సమయంలో నగదు పంపిణీ అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని అధికారులకు రోనాల్డ్ రోస్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా నోడల్ అధికారులతో కమాండ్ కంట్రోల్ లో నోటిఫికేషన్ ముందు చేపట్టాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. మద్యం నియంత్రణకు ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారిని ఆదేశించారు.
మద్యం షాపులు కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలు
మద్యం షాపులను 100 శాతం కవరేజ్ అయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 10 లక్షలు అంతకుమించి నగదు పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ లో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారిని కోరారు. జాప్యం కారణంగా అక్కడికి వెళ్లిన ఎన్ ఫోర్స్మెంట్ బృందాల సమయం వృథా అవుతుందని ఐటీ అధికారులకు సమాచారం వచ్చిన వెంటనే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు తావివ్వకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కస్టమ్స్ అధికారులను ఆదేశించారు. వేర్ హౌసెస్ మ్యాపింగ్ వివరాలను తెలియజేయాలని రోనాల్డ్ రాస్ అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జనవరి 1 నుంచి బ్యాంక్ క్యాష్ విత్ డ్రాయల్ వివరాలు అదేవిధంగా యూపీఐ(U.P.I) వివరాలు ఇవ్వాలని ఎస్.ఎల్.బి.ఓ అధికారిని ఆదేశించారు. నిర్దేశించిన పరిమితి మించి నగదు క్యాష్ డ్రాయల్ వివరాలను తెలియజేయాలి. నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన అనుమానితులు, ఇంతకు ముందు జరిగిన కేసులపై ఫోకస్ పెట్టాలని నార్కోటిక్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లను ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు తర్వాత ఏర్పాటు చేసే సందర్భంలో మిగతా శాఖల సిబ్బంది పేర్లను పోలీస్ శాఖకు పంపించాలని రవాణా, ఎక్స్ సైజ్ శాఖ అధికారులను కోరారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు మూడు కమిషనరేట్ లో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరో 7 చెక్ పోస్టులతో మొత్తం 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఎన్నికల సమయంలో చెక్ పోస్టులు 24 గంటలపాటు పని చేస్తాయని.. అందుకు షిఫ్ట్ వారీగా రవాణా, ఎక్సైజ్, జి ఎస్ టి ఇతర శాఖల వారు సిబ్బంది వివరాలు రేపటి (ఆదివారం) లోగా అందజేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి నిర్వహించిన ఈ సమావేశంలో ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఎన్నికల వ్యయం నోడల్ అధికారి శరత్ చంద్ర ఆయా శాఖల ఐటీ, నార్కొటిక్, ఎస్ ఎల్ బి సి, ఆర్ బి ఐ, ఎక్స్ సైజ్, ఆర్ టి ఆర్ ఆయా శాఖల ఎన్ ఫోర్స్ మెంట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.